తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. 1985 నుంచి ఆయన పోటీచేసిన
ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ
ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చరిత్ర
సృష్టిస్తున్నారు. రాష్ర్టంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఈసారి రెండు
స్థానాలు కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటిం చారు. ఈ
నిర్ణయం రాష్ర్ట రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కేసీఆర్ జైత్రయాత్ర : రాష్ట్రంలో 1985 నుంచి పోటీచేసిన ప్రతీ ఎన్నికలో
కేసీఆర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. భిన్నమైన ప్రాంతాల నుంచి పోటీచేసి తన
ప్రజాదరణను రెట్టింపు చేస్తున్నారు. సిద్దిపేట నుంచి రాజకీయ ప్రస్థానం
ప్రారంభించిన కేసీఆర్.. ఎమ్మెల్యేగా 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2004లో అటు సిద్దిపేట అసెంబ్లీకి,
కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీచేసి రెండు స్థానాల్లో కూడా విజయం సాధించి
రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కూడా సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి,
కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి రెండుచోట్లా గెలుపొందారు. తెలంగాణ
వాదాన్ని అవహేళన చేస్తూ అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణరావు చేసిన
వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకొని కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తే, 2006లో
కరీం నగర్ లోక్‌సభకు వచ్చిన ఉప ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజార్టీతో తిరిగి
గెలుపొందారు. ఆ తరువాత 2008లో మరో సారి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప
ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. తెలంగాణ వాదం కేవలం ఉత్తర తెలంగాణకే
పరిమితమైందని సమైక్యవాదులు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 2009లో
మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీచేసి ఘనవిజయాన్ని సాధించారు.