అక్కడి రెస్టారెంట్లో బాగా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయారు. దీనికి
బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రభుత్వం రెస్టారెంట్ బిల్లును చెల్లించింది.
కొందరు పైకి డబ్బున్న వ్యక్తుల్లా నటిస్తూ.. నెలల తరబడి ఖరీదైన లగ్జరీ
హోటళ్లలో ఉంటూ బిల్లు కట్టకుండా పారిపోతుంటారు. అలాంటి వారిపై హోటల్
యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, సదరు వ్యక్తులను బ్లాక్ లిస్ట్‌లో
పెట్టడం వంటివి చేస్తుంటాయి. కానీ, దీనికి భిన్నంగా.. తమ దేశ పౌరుల తీరుకు
బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రభుత్వం బిల్లు చెల్లించింది.*
ఇటలీకి చెందిన కొందరు వ్యక్తులు విహార యాత్ర కోసం అల్బేనియా వెళ్లారు. అక్కడి
రెస్టారెంట్లో బాగా తిని బిల్లు (సుమారు రూ. ఏడు వేలు) చెల్లించకుండా
పారిపోయారు. తర్వాత కొద్ది రోజులకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అల్బేనియా
వెళ్లారు. ఈ సందర్బంగా ఆమెకు తమ దేశ పౌరులు రెస్టారెంట్లో బిల్లు
చెల్లించకుండా పారిపోయిన విషయం తెలిసింది. వెంటనే ఆ బిల్లును చెల్లించాలని ఆమె
అధికారులకు సూచించారు. ‘‘ ఆ మూర్ఖుల తరపున మీరు బిల్లు చెల్లించండని ఇటలీ
రాయబారికి సూచించినట్లు అల్బేనియా ప్రధాని ఎడీరమా ఒక వార్తా సంస్థకు తెలిపారు.
ఈ పర్యటనలో ఇటలీ ప్రధానితో పాటు పర్యటిస్తున్న ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి
ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా ఈ ఘటనపై స్పందిస్తూ ‘‘మా దేశ పర్యాటకులు ఎగవేసిన
బిల్లును చెల్లించాలని ప్రధాని సూచించారు. ఇటలీ రాయబారి ఈ పని పూర్తి
చేస్తారు. కొందరు నిజాయితీ లేని వ్యక్తులు తమ ప్రవర్తన కారణంగా మంచి వ్యక్తులు
ఉన్న దేశం పేరును చెడగొట్టలేరు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా ఇటలీ
నుంచి సుమారు ఐదు లక్షల మంది పర్యాటకులు అల్బేనియాను సందర్శిస్తుంటారు. ఇటలీలో
దేశీయంగా పర్యాటకం ఖరీదు కావడంతో ఆ దేశ ప్రజలు ఎక్కువగా అల్బేనియాకు విహార
యాత్రలకు వెళుతుంటారు. అక్కడ టూరిస్ట్ ప్యాకేజ్‌లు తక్కువ ధరకే అందుబాటులో
ఉండటంతో ఇటాలియన్లు అల్బేనియా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.