కీవ్ : చెర్నిహైవ్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణుల దాడిలో ఏడుగురు పౌరులు
మరణించిన ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు.
తాజా పరిణామాలకు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ‘‘రష్యా
జరిపిన ఈ ఉగ్రదాడిపై మా సైనికులు కచ్చితంగా ప్రతిస్పందిస్తారు. జవాబు
స్పష్టంగా ఉంటుందని స్వీడన్ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా దాడి ఘటనలో గాయపడినవారి సంఖ్య 148కి చేరిందని చెర్నిహైవ్ వ్యాచెస్లావ్
చౌస్ వెల్లడించారు. విదేశీ పర్యటనల్లో భాగంగా జెలెన్స్కీ నెదర్లాండ్స్
చేరుకున్నారు. డచ్ వైమానిక స్థావరంలో ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయి
పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమతో పాటు డెన్మార్క్ ఎఫ్-16 యుద్ధ
విమానాలను ఉక్రెయిన్‌కు అందిస్తామని జెలెన్స్కీకి రూట్ హామీ ఇచ్చారు. అంతకు
ముందు వారిద్దరూ హేంగర్లో పార్క్ చేసిన రెండు బూడిదరంగు ఎఫ్-16
యుద్ధవిమానాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌కు 19 ఎఫ్-16 యుద్ధ
విమానాలను అందిస్తామని తాజాగా డెన్మార్క్ వెల్లడించింది. తమ దేశ తయారీ యుద్ధ
విమానం ఎఫ్-16ను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా నెదర్లాండ్స్,
డెన్మార్క్‌లకు అనుమతించిన సంగతి తెలిసిందే.
ఉక్రెయిన్ దాడిలో అయిదుగురు రష్యన్ పౌరులకు గాయాలు : రష్యా సేనలు
కుపియాన్స్క్పై జరిపిన బాంబు దాడుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని
ఖర్కీవ్ గవర్నర్ ఒలేహ్ సినీహుబోవ్ చెప్పారు. మరో వైపు రష్యా కుర్స్క్
నగరంలోని రైల్వేస్టేషన్‌పై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఐదుగురు
గాయపడినట్లు ప్రాంతీయ గవర్నర్ రోమన్ స్టార్వోయిట్ తెలిపారు. ఈ నగరం
ఉక్రెయిన్ సరిహద్దులో ఉంటుంది. స్టార్వోయిట్ తెలిపిన వివరాల ప్రకారం డ్రోన్
దాడిలో రైల్వేస్టేషన్ భవనం పైకప్పు తీవ్రంగా ధ్వంసమైంది. ఆ తరువాత అక్కడ
మంటలు చెలరేగాయి. కాగా తెల్లవారుజామున మాస్కో వైపు దూసుకొస్తున్న మరో
డ్రోన్‌ను రష్యా వైమానిక దళం నిలువరించింది. దానిని ముందుగానే కూల్చివేసింది.
‘తమపై ఉగ్రదాడి చేసేందుకు కీవ్ ప్రయత్నించిందని’ రష్యా రక్షణశాఖ అధికారులు
ఆరోపించారు. డ్రోన్ దాడులు ముమ్మరం కావడంతో మాస్కో రెండు ముఖ్య
విమానాశ్రయాల్లో సేవలను నిలిపివేసింది.