పాడేరు : పాడేరు ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన ప్రదేశాన్ని
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్
ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ఆర్టీసీ, పోలీస్
అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురై, వెంటనే ఘటన స్థలానికి వెళ్ళమని మంత్రి
అమర్నాథ్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాడేరు చేరుకున్న మంత్రి
ప్రమాద స్థలాన్ని పరిశీలించి అనంతరం, జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను
అమర్నాథ్ కోరారు. అవసరమైతే కేజీహెచ్ కు లేదా కార్పొరేట్ ఆసుపత్రులకైనా
క్షతగాత్రులను తరలించి వారు పూర్తిస్థాయిలో కోలుకునే విధంగా వైద్య సహాయం
అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో
మాట్లాడుతూ విశాఖ నుంచి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో
పడిందని, ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని
తెలిపారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీ హెచ్ కు తరలించామని
తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా
ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని ఆయన చెప్పారు. అలాగే
శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలు, గాయపడిన వారికి లక్ష
రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు అమర్నాథ్
తెలియజేశారు. పాడేరు ఘాట్ రోడ్డుపై ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ
అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రమాద ఘటనపైవిచారణ జరిపిస్తామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తో సహా 34 మంది బస్సులో ఉన్నారు. అందులో ఇద్దరు
అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన 32 మందిలో ఆరుగురును మెరుగైన చికిత్స కోసం
విశాఖపట్నం తరలించారు. మిగిలిన 26 మందిలో 21 మంది పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో
చికిత్స పొందుతున్నారు. వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి
ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం చాలా వేగంగా స్పందించి
సహాయ చర్యలు చేపట్టడం అభినందనీయమని, కలెక్టర్, ఎస్పీ, ఎంఎల్ఎ, పోలీసు
యంత్రాంగం, డాక్టర్లను మంత్రి అభినందించారు. మంత్రితో పాటు జిల్లా పరిషత్
ఛెర్పర్సన్ జె. సుభద్ర, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుహిన్
సిన్హా, స్థానిక శాసనసభ్యులు కె. భాగ్యలక్ష్మి, ట్రైకార్ చైర్పర్సన్ శతక
బుల్లి బాబు, డిఆర్ఓ పి. అంబేద్కర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.