ఆస్ట్రేలియా
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పంద్రాగస్టు వేడుకలు
మాస్కో, వాషింగ్టన్ : భారత్‌తో తమకు గల అనుబంధం ప్రత్యేకం, వ్యూహాత్మకం అని
పలు దేశాలు పేర్కొన్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న భారత్‌కు
శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయా దేశాల అధినేతలు, నాయకులు రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లకు అభినందన సందేశాలు పంపారు.
భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని వాటిలో పేర్కొన్నారు. అమెరికా,
రష్యా, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, ఆస్ట్రేలియా, ఇరాన్, భూటాన్, మారిషస్,
ఇజ్రాయెల్, మాల్దీవులు తదితర దేశాల నుంచి సందేశాలు అందాయి. ఫ్రాన్స్
అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బాస్టిల్ డే సందర్భంగా ప్రధాని మోదీ
పాల్గొన్న కీలక కార్యక్రమాల వీడియోను కూడా షేర్ చేశారు. బ్రిటన్ రాజధాని
లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున భారత సంతతి ప్రజలు
చేరుకుని స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొన్నారు. వందేమాతరం, భారత్ మాతా కీ
జై అంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి హాజరై
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో
భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా దేశాల్లోని భారత
సంతతి ప్రజలు ఆయా కార్యక్రమాలకు హాజరై తమ దేశభక్తిని చాటుకున్నారు.
అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఉత్సవాల్లో ఆ దేశ విదేశాంగ మంత్రి అంటోని
బ్లింకెన్ పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో
జరిగిన వేడుకలకు స్థానిక భారతీయులు, అధికారులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో భారత
రాయబారి మన్‌ప్రీత్ వోహ్రా జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రపతి సందేశాన్ని
చదివారు. సింగపూర్‌లో తాత్కాలిక రాయబారి పూజ ఎం. టిల్లు 1000 మంది భారత సంతతి
ప్రజలతో కలిసి ఐఎన్ఎస్ కులిష్ను సందర్శించారు. శ్రీలంకలో రాయబారి గోపాల్
బాగ్లే ఇతర అధికారులు భారత శాంతి పరిరక్షక దళం స్మారకం వద్ద శ్రద్ధాంజలి
ఘటించారు.