విజయవాడ : మితవాదులు, తిరుగుబాటుదారుల మధ్య సమతూకం సాధించిన, గాంధీ మహాత్ముని రాకతోనే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిదని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉపన్యాస పరంపరలో భాగంగా “భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమ తత్వం” అనే అంశంపై.సిసోడియా ప్రసంగించారు. విశాఖపట్నంలో కార్యక్రమం జరగగా విజయవాడ రాజ్ భవన్ నుండి గురువారం వర్చువల్గా పాల్గొన్నారు. సిసోడియా మాట్లాడుతూ 19వ శతాబ్దంలో సాయుధ తిరుగుబాట్లు, ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై చెదురుమదురుగా జరిగాయని, మహాత్మా గాంధీ రాక తర్వాత 20వ శతాబ్దంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రజా ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయన్నారు. ప్రాంతీయ, కుల, మతాల వారీగా విడిపోయి, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న ఒక పెద్ద దేశం అనే వాస్తవాన్ని మహాత్మా గాంధీ అర్థం చేసుకున్నారని, గాంధీజీ అనేక యాత్రలు చేసి, సమావేశాలు నిర్వహించారన్నారు.
ప్రజల్లో ఐక్యత తీసుకురావడమే కాకుండా ఒక దేశంగా భారతదేశం అనే భావనను పెంపొందించడమే ఈ చర్య వెనుక ఉన్న తత్వశాస్త్రం అని సిసోడియా అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ప్రజా ఉద్యమాల తాత్వికత చివరకు దేశం స్వాతంత్ర్యం పొందేలా చేసిందని, ఈ సామూహిక ఉద్యమాలతో, మహాత్మా గాంధీ తప్పనిసరిగా విజయవంతమైన దేశాన్ని సృష్టించడానికి ఒక తత్వశాస్త్రాన్ని రూపొందించగలిగారన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే సార్వత్రిక ఓటు హక్కును అందించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుందన్నారు. హరిత విప్లవంతో దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని, శ్వేత విప్లవం తర్వాత ఆహార స్వయం సమృద్ధి సాధించగా, నేడు ఆహారం కోసం అనేక దేశాలు భారతదేశం మీద ఆధారపడి ఉన్నాయన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశాన్ని సామాజిక స్వాతంత్ర్యం వైపు నడిపించగా, దేశంలోని ప్రతి పౌరుడు స్వతంత్రులయ్యారన్నారు. శాస్త్రీయ దృక్పధం, విచారణ స్ఫూర్తిని పెంపొందించుకున్నప్పుడు మనం మేధో స్వాతంత్య్రాన్ని పొందగలుగుతామని, పిల్లలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించాలని సిసోడియా విద్యావేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ మహేంద్ర దేవ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అచార్య గలాబ్ , అచార్య నాగభూషణరావు, తదితరుల పాల్గొన్నారు.