151 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 50 మంది సిట్టింగులకు వచ్చేసారి టికెట్
దక్కదనే ప్రచారం
పలువురికి ఎంపీ టిక్కెట్లు ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్ఠానం
దాదాపు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరగొచ్చనే టాక్
అమరావతి : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అబ్యర్థుల ఎంపిక పై అన్ని రాజకీయ
పార్టీలు దృష్టి సారించాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇందులో నిమగ్నమయ్యాయి.
గెలుపోటములను అంచనా వేస్తూ జాబితాలు రూపొందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలల సమయం కూడా లేదు. ఎన్నికల
నోటిఫికేషన్ విడుదల కావడానికి ఇంకో పది నెలల సమయమే ఉంది. అయితే
అంతకన్నా ముందే కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉ న్నాయనే ప్రచారం
జరుగుతోంది. దాదాపు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరగొచ్చనే టాక్ ఉంది.
అదే జరిగితే ఇంకో ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉండొచ్చు. మరి ముందస్తు ఉన్నా
లేకపోయినా, ఎన్నికలకు ఇంకో పది నెలల సమయం గట్టిగా ఉంది. ఈ లోపే
పార్టీలు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి అభ్యర్థుల
ఖరారు అంశం ఇందులో అతి ప్రధానమైనది. అధికార, ప్రతిపక్ష పార్టీలు
అభ్యర్థుల విషయంలో ఆలోచించుకోవాల్సిన సమయం దాదాపు ఇదే. ఇన్నాళ్లూ ఒక
ఎత్తు, ఇక మిగిలిన సమయం మరో ఎత్తు. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఎక్కడి నుంచి
బరిలోకి దిగాలనే అంశంపై పార్టీల అధిష్టానాలు ఇప్పుడు తేల్చుకోవాల్సిన సమయం
ఆసన్నమవుతూ ఉంది. సిట్టింగులను పక్కన పెట్టాలన్నా, వారి అసంతృప్తిని
చల్లార్చాలన్నా ఇదే తగిన సమయం. పార్టీలు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారనే
ప్రచారం జరుగుతూ ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇందులో ముందంజలో ఉంది. చాన్నాళ్లుగా ఈ పార్టీ
విషయంలో ఉన్న ప్రచారం చాలా మంది సిట్టింగులను పక్కన పెడుతుందనేది. 151
మంది ఎమ్మెల్యేల్లో సుమారు 50 మంది సిట్టింగులకు వచ్చేసారి టికెట్
దక్కదనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతూ ఉంది. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధినేత జగన్ ప్రామాణికాలు ఆయనకు ఉన్నాయనే విశ్లేషణా ఉంది. మరి
ఇలాంటి మార్పుచేర్పుల విషయంలో జగన్ కూడా కుండబద్ధలు కొట్టినట్టుగా
వ్యవహరించడానికీ వెనుకాడటం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే
స్పష్టమైంది. అసెంబ్లీ సభ్యుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు
నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల
పోలింగ్ కు మునుపే సదరు సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్
కేటాయించలేమనే సంగతిని తెలియపరిచినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ
విషయాన్ని వారిలో కొందరు బాహాటంగానే చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల
వరకూ ఏదో ఒక మాట చెప్పి చివర్లో వారికి అసలు సంగతిని చెప్పడం కన్నా
జగన్ ముందుగానే వారి స్పష్టతను ఇస్తున్నారనే విషయం తేటతెల్లం
అయ్యింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ వారికి దక్కదనే విషయాన్ని ముందుగానే
చెప్పడానికి జగన్ వెనుకాడటంల ఏదనే స్పష్టతా వచ్చింది. మరి కేవలం ఆ
నలుగురికే కాదు.. ఇంకా చాలా మందికి ఈ విషయాన్ని సూఛాయగా చెప్పేశారనే టాక్
కూడా నడుస్తూ ఉంది. వారికి వేరే మార్గాలు, ప్రత్యామ్నాయాల్లో అవకాశం
కల్పిస్తామని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపుకోసం పని చేయాలనే
సూచన సీఎం జగన్ నుంచి అందినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ మార్పు
చేర్పులు ఎలా ఉంటాయంటే.. ఊహకు అందనట్టుగా అనే మాట వినిపిస్తూ ఉంది.
సిట్టింగులకు టికెట్ నిరాకరించడం అంటే.. ఏదో పేరుకు జరిగే పని కాదని,
పార్టీలో కీలకం అనుకుంటున్న వారిని, గత ఎన్నికల్లో సంచలన విజయాన్ని
సాధించిన వారిని కూడా మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. జగన్
చేయబోయే మార్పులు షాకింగ్ లెవల్లో ఉండేలా ఉన్నాయి విశ్వసనీయ సమాచారం
ప్రకారం. అందుకు ఉదాహరణగా ఉమ్మడి అనంతపురం జిల్లా సీట్లనే తీసుకుంటే
అభ్యర్థిత్వాలు ఆశ్చర్యకరమైన రీతిలో ఉండబోతున్నాయన్నా ప్రచారం
సాగుతోంది.
రాప్తాడు విషయంలో పెనుమార్పు? : రాప్తాడులో గత ఎన్నికల్లో వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోటను
బద్ధలు కొడుతూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. 2009లో తృటిలో
మిస్ అయిన విజయం తోపుదుర్తి కుటుంబాన్ని 2019లో వరించింది. ఇక ఎమ్మెల్యేగా
తోపుదుర్తి పనితీరు ఎలా ఉన్నా జగన్ ఇమేజ్ మీదే వచ్చే ఎన్నికల్లో విజయం
ఆధారపడి ఉంది. ప్రత్యేకించి జగన్ ఇమేజ్ తో పని లేకుండా సొంతంగా గెలిచేంత
స్థాయిలో మాత్రం ప్రకాష్ రెడ్డి ఎదగలేకపోయారు. అనుచరవర్గం, సొంత
క్యాస్ట్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు అండగా లేదు. ప్రకాష్ రెడ్డి కోసం
చాలా మంది ఖర్చులు కూడా పెట్టుకున్నారు గత ఎన్నికలకు ముందు. అలాంటి వారి
ఆదరణను ఇప్పుడు ప్రకాష్ రెడ్డి కలిగి లేరు. ఒకవేళ రేపటి ఎన్నికల్లో
ప్రకాష్ రెడ్డి గెలిచినా, ఓడినా అది కేవలం జగన్ ఇమేజ్ మీదే నడవాలి.
జగన్ సంక్షేమ పథకాలు ఫలప్రదంఅ యితే ప్రకాష్ రెడ్డికి విజయం
దక్కుతుంది, లేకపోతే లేదు. ఇందులో ఇంతకన్నా విశ్లేషణ లేదు. మరి ఈ సీటు
విషయంలో జగన్ అభ్యర్థి మార్పు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అది
కూడా బోయ గిరిజమ్మను రాప్తాడు నుంచి నిలబెట్టబోతున్నారనే ప్రచారం
జరుగుతూ ఉంది. ముప్పై యేళ్ల వయసున్న ఈ బీసీ మహిళను రెండేళ్ల కిందట
సంచలన రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా చేశారు.
అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన గిరిజమ్మ ఇంటి పేరును బట్టి బోయ
సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని స్పష్టం అవుతోంది. చిన్న వయసులోనే
రాజకీయాల పట్ల ఆకర్షితురాలైన గిరిజమ్మ జడ్పీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఫ్లోర్ లీడర్ గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్లపై దూకుడైన పోరాటాలకు
కేరాఫ్ అయ్యారు. ఈ ధోరణి ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది.