విడదల రజినీకి కొత్త ప్రత్యర్థి
మహిళా మంత్రిపై జగన్‌కు ఫిర్యాదుల వెల్లువ
గుంటూరు : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజినీకి
ప్రత్యర్థి మారనున్నారు. గత ఎన్నికల్లో నాటి మంత్రి, టీడీపీ సీనియర్ నేత
పత్తిపాటి పుల్లారావును మట్టికరిపించి, రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని
విడదల రజినీ ఆకర్షించారు. జగన్ రెండో కేబినెట్లో రజినీ బెర్త్
దక్కించుకున్నారు. చిన్న వయసులోనే అమాత్య పదవి దక్కించుకున్న
ఎమ్మెల్యేగా విడదల రజినీ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, కీలకమైన
వైద్యారోగ్యశాఖ మంత్రిత్వ పదవిని దక్కించుకున్నారు. అయితే మంత్రి పదవి
మాత్రమే ఆమెకు, పవర్స్ మాత్రం సీఎం వైఎస్ జగన్ వద్దే అని వైసీపీలో చర్చ
జరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.
చిలకలూరిపేటలో గెలవడం విడదల రజినీకి పెద్ద సవాల్‌గా మారింది.
ముఖ్యంగా సొంత వాళ్ల నుంచే ఆమె వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే
రజినీపై పల్నాడు కోఆర్డినేటర్లు భూమన కరుణాకరరెడ్డి, బీద
మస్తాన్‌రావులకు చిలకలూరిపేట వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. తనపై
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా రజినీ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఎందుకంటే
తనకే టికెట్ అనే ధీమా ఆమెలో కనిపిస్తోంది.
మరోవైపు టీడీపీలో అదే పరిస్థితి. చిలకలూరిపేట టీడీపీ ఇన్చార్జ్, మాజీ
మంత్రి పత్తిపాటి పుల్లారావుకు టీడీపీ ఎసరు పెట్టింది. ఆయన ప్లేస్‌లో
భాష్యం ప్రవీణ్‌ను బరిలో దింపేందుకు సిద్ధమైంది. నారా లోకేశ్
సన్నిహితుడిగా వ్యాపారవేత్త అయిన భాష్యం ప్రవీణ్ చిలకలూరిపేటలో
రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. తన
నాయకత్వానికి ప్రమాదం ఎదురు కావడంతో పుల్లారావు టీడీపీ అధిష్టానంపై ఫైర్
అవుతున్నారు. ఇటీవల భాష్యం ప్రవీణ్‌ను ప్రోత్సహిస్తున్న అధిష్టానం
పెద్దలపై పుల్లారావు విమర్శలు చేశారు. దీంతో పుల్లారావును పిలిపించుకున్న
చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. టీడీపీ అధికారంలోకి
రావాలని కోరుకుంటూనే, మీరు ఓడిపోయే పరిస్థితి ఉన్నా టికెట్ కావాలంటే ఎలా?
మరోసారి విమర్శలకు దిగితే పార్టీ నుంచి బయటికి పంపుతానని వార్నింగ్
ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పుల్లారావు నోర్మూసుకున్నారు. జూలైలో భాష్యం
ప్రవీణ్‌ను చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు
ప్రకటించనున్నారు. కొత్త అభ్యర్థిని ఎదుర్కోడానికి విడదల రజినీ ఎలాంటి
వ్యూహం రచిస్తారో చూడాలి. కనీసం ఇప్పటికైనా సొంత పార్టీ కేడర్‌కు పనులు
చేయడంపై రజినీ దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది.
మహిళా మంత్రిపై జగన్‌కు ఫిర్యాదుల వెల్లువ : పల్నాడుకు చెందిన మహిళా
మంత్రి విడదల రజినీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భారీగా ఫిర్యాదులు
వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. 2019లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన
విడదల రజినీ జగన్ గాలిలో చిలకలూరిపేట నుంచి గెలుపొంది ఆ తర్వాత రెండో
కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కించు కున్న అత్యంత
అదృష్టవంతురాలిగా గుర్తింపు పొందారు. అయితే తన నియోజకవర్గంలో కేడర్‌కు
అందుబాటులో ఉండరని, వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితే లేదనే
ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ప్రధానంగా మంత్రి రజినీపై భారీగా అవినీతి
ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ నాయకులే తమ పనులు చేయడానికి
రజినీ ఎంతెంత డబ్బు తీసుకున్నారో ఆధారాలతో సహా అధిష్టానం పెద్దల దృష్టికి
తీసుకెళ్లినట్టు సమాచారం. రజినీపై ఆరోపణలు, తగిన ఆధారాలతో సహా
తీసుకెళ్లి సీఎం జగన్ ఎదుట మరో మంత్రి పెట్టినట్టు సమాచారం. పల్నాడు
జిల్లాకు సంబంధించి ఆ మంత్రి పార్టీ బాధ్యతల్ని చూస్తున్నారని సమాచారం.
విడదల రజినీ ఎంతసేపూ తానేదో అద్భుతంగా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో
విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ, సీఎం జగన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ
కేడర్‌లో పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నారని, క్షేత్రస్థాయిలో అంత సీన్
లేదని సదరు మంత్రి పార్టీ అధిష్టానం పెద్దలకు నివేదించినట్టు సమాచారం.
మరోవైపు పీకే టీమ్ కూడా చిలకలూరిపేటలో రజినీకి అంత సీన్ లేదని, ఆమెకు
టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని సీఎంకు నివేదించినట్టు సమాచారం. అతి
తక్కువ సమయంలోనే రజినీకి పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి.
చిన్న వయసులో అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి పేరు సంపాదించుకోవాల్సింది పోయి,
శత్రువులను రోజురోజుకూ పెంచుకుంటున్నారనే విమర్శ ఆమెపై వుంది. దీపం
ఉన్నప్పుడు ఇంటిని చక్కదిద్దు కోవాలనే క్రమంలో, పొలిటికల్ కెరీర్‌కే
ప్రమాదం వచ్చేలా ఆమె వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి.