ఏపీలో జగన్ వర్సెస్ షర్మిల?
పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం
జగనన్నపై కాంగ్రెస్ సంధించిన అస్త్రం కాబోతోందా?
గుంటూరు : దివంగత వైఎస్సార్ తనయ.. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల.. ఒకప్పుడు
జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు ఆమె జగనన్నపై కాంగ్రెస్ సంధించిన అస్త్రం
కాబోతోందా? వైసీపీ అధినేత జగన్ జైలులో ఉండగా పాదయాత్ర చేసిన ఆయన సోదరి షర్మిల
అప్పట్లో ప్రతి ప్రసంగంలోనూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకునే వారు.
ఆ తరువాత అంటే జగన్ ఏపీ సీఎం అయిన తరువాత జగన్ ఆ బాణాన్ని పక్కన పెట్టేశారు.
అవసరమే లేదన్నట్లుగా వదిలేశారు. పార్టీలో ఇసుమంతైనా ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆమె
స్వయంగా పార్టీనీ, రాష్ట్రాన్నీ వీడి పొరుగు రాష్ట్రంలో సొంత కుంపటి
పెట్టుకుని రాజకీయాలు చేసుకునే విధంగా తరిమేశారు. సొంత పార్టీని నడిపేందుకు
ఆమె ఇబ్బందులు పడుతున్నా ఇసుమంతైనా సహాయం చేయలేదు. దీంతో ఇరువురి మధ్యా
పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆ పరిస్థితినే ఇప్పుడు కాంగ్రెస్ తనకు అనుకూలంగా
మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. జగన్ వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ
వైఎస్ బ్రాండ్ ను కోల్పోయింది. ఇప్పుడు షర్మిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా
జగన్ నుంచి ఆ బ్రాండ్ ను లాగేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఏపీలో
నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చి, కొత్త
ఊపిరులూదేందుకు షర్మిల కాంగ్రెస్ కు ఒక ఆయుధంగా కనిపిస్తున్నది.
దివంగత మహానేత వైఎస్ ముద్దుల బిడ్డ, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల తన
పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు, రంగం దాదాపు సిద్ధమైపోయిందనే
అంటున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనీ, షర్మిల
కోరినట్లుగా ఆమె తెలంగాణలో పార్టీకి సేవలు అందించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం
అంగీకరించలేదు. ఆమె ఏపీలోనే పార్టీకి సేవలందించాలని కాంగ్రెస్ విస్పష్టంగా
చెప్పేసింది. అవసరమైతే ఏపీ పీసీసీ చీఫ్ గా ఆమెను నియమించేందుకు కూడా సిద్ధంగా
ఉన్నట్లు చెప్పేసింది. ఇందుకు ఆమె తొలుత ముందు వెనుకలాడినా చివరకు
అంగీకరించినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ గూటికి
చేరడం ఖాయమనీ, అయితే ఎప్పుడు ఎవరి సమక్షంలో చేరుతారన్నదే ఖరారు కావాల్సి ఉందని
అంటున్నారు. వైఎస్ ఆత్మ, ఆ కుటుంబంతో విడదీయలేని బంధం ఉన్న కెవిపి
రామచంద్రరావు కూడా షర్మిల కాంగ్రెస్లో చేరుతుందన్న సమాచారం ఉందని చెప్పడాన్ని
బట్టి షర్మిల కాంగ్రెస్ లో చేరిక లాంఛనమేననీ, ఇడుపుల పాయలో సోనియా, రాహుల్
సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతమౌతుందని పార్టీ అగ్రనాయకత్వం
భావిస్తోంది. ఆమె రాక వైసీపీని గట్టిగా దెబ్బతీస్తుందని కాంగ్రెస్
సీనియర్లు నమ్ముతున్నారు. అన్నిటికీ మించి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు
షర్మిల రాక శరాఘాతం కాకతప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత జిల్లా
కడపలో జగన్కు సరిసమానమైన ఆదరణ షర్మిలకు ఉందని చెబుతున్నారు. ఆమె రాకతో ఏపీలో
రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.