3 నుండి 7 విడతలలో ఏపీలో ఎన్నికలు?
అమరావతి : ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలి. ఇదే ఇప్పుడు ఏపీలో జగన్ మోహన్
రెడ్డి ఆలోచన. ఆ మాట కొస్తే అన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసమే కదా. కాకపోతే
జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈసారి ఎన్నికలలో అధికారం
దక్కించుకుంటే ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయొచ్చు. రాజధానిని అమరావతి సహా
రాష్ట్రాన్ని తనకి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా టీడీపీని
కోలుకోలేని విధంగా దెబ్బకొట్టొచ్చు. తొలిసారి సీఎం కనుక తన పాలనకు వచ్చే
ఎన్నికలను రెఫరెండంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ ఈసారి ఎన్నికలకు
అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలలో
దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ను రంగంలోకి దించిన జగన్
వారి వ్యూహాలకు అనుగుణంగా సోషల్ మీడియాను సిద్ధం చేసుకుంటున్నారు. అంతే
కాకుండా ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా జగన్ మరో వ్యూహాన్ని రచించినట్లు
తెలుస్తుంది. ఏపీలో ఈసారి ఎన్నికలను ఒకే విడతలో కాకుండా 3 నుండి 7 విడతలలో
నిర్వహించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసమే తాజాగా జగన్ మోహన్
రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏపీలో ఒకే దశలో ఎన్నికలు జరగగా ఇప్పుడు దశల వారీగా ఎన్నికలు
జరపాలని జగన్ కోరుతున్నట్లు కథనాలొస్తున్నాయి. ఒకే దశలో ఎన్నికలు జరిగితే ఎంత
అధికారంలో ఉన్నా రాష్టవ్యాప్తంగా పోల్ మేనేజ్ మెంట్ చేయడం కష్టమవుతుంది.
అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కళ్లకు కడుతున్న పరిస్థితుల్లో ఎంతగా
అధికారాన్ని అడ్డుపెట్టుకున్నా ప్రజాగ్రహాన్ని బలప్రయోగంతో అణచివేయడం అంత
సులువు కాదు. అదే దశల వారీగా జరిగితే ఒక్కో దశలో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్
పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీలకు, అందునా రాష్ట్రంలో
అధికారంలో ఉండే పార్టీకి ఇలా దశల వారీ ఎన్నికలతో అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతో
గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జగన్ ఈ తరహా ప్రతిపాదనను కేంద్రం
ముందుంచినట్లు తెలుస్తున్నది.
అయితే, 175 మాత్రమే స్థానాలున్న ఏపీలో ఇలా దశలవారీగా ఎన్నికలు అవసరమా? అసలు
ఎన్నికల కమిషన్ ఈ తరహా ఆలోచన చేస్తుందా అంటే ఆ అవకాశం లేకపోలేదు. గత ఏడాది
గుజరాత్ ఎన్నికలలో రెండు ఫేజ్లలో, మణిపుర్లో రెండు ఫేజ్లలో, యూపీలో 7
ఫేజ్లలో ఎన్నికలు జరిగగా ఈ మూడు రాష్ట్రాలలో మణిపుర్ ఏపీ కంటే తక్కువ
సీట్లున్న రాష్ట్రం. అంతకు ముందు 2021లో 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్
అసెంబ్లీ ఎన్నికలను 8 ఫేజ్లలో నిర్వహించారు. కనుక ఏపీలో విడతల వారీగా
ఎన్నికలను నిర్వహించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఏపీ
విషయానికి వస్తే 175 సీట్లు ఉండగా మొత్తం 7 విడతలలో పోలింగ్ నిర్వహించాలని
వైసీపీ కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిసిన జగన్మోహన్
రెడ్డి ఈ మేరకు వారి వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే,
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ బీజేపీ చెప్పినట్లుగా
నడుచుకుంటుందా అంటే ఇండియాలో ఏదైనా సాధ్యమేనంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత
పరిస్థితులను గమనిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల కమిషన్
మధ్య ఆ మాత్రం సంబంధాలు ఉండడం సహజమే. అందుకే ఈ మధ్య కాలంలో దేశంలో జరిగిన
ఎన్నికలను చూస్తే దాదాపుగా బీజేపీకి సౌలభ్యంగా ఉన్న రోజులలోనే పోలింగ్
జరిగింది. అయితే, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కోరినట్లుగా 7 విడతలలో అంటే కష్టమైన
పనే కాగా అందుకు ఈసీ అంగీకరించకపోవచ్చు. కానీ మూడు నుండి ఐదు విడతలలో ఎన్నికలు
నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.