తొలిసారిగా మహిళా నాయకురాలికి అధ్యక్షురాలిగా బీజేపీ అవకాశం
అమరావతి : నందమూరి కుటుంబసభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు ‘చిన్నమ్మ’గా
పిలుచుకునే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా
నియమితులయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖకు
12 మంది అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కంభంపాటి హరిబాబు,
కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం 15
మంది అధ్యక్షులూ పురుషులే. తొలిసారిగా మహిళా నాయకురాలికి అధ్యక్షురాలిగా
బీజేపీ అవకాశం కల్పించింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ద్వితీయ కుమార్తె
అయిన పురందేశ్వరి 1959 ఏప్రిల్ 22న జన్మించారు. బీఏ, డిప్లొమా ఇన్ జెమాలజీ
చదివారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా,
మంత్రిగా, ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా పని చేసినప్పుడు కూడా ఆమె రాజకీయాలపై
ఆసక్తి ప్రదర్శించలేదు. ఎన్టీఆర్ మరణానంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు
కొంతకాలం బీజేపీలో ఉన్నారు. అనంతరం బీజేపీ , టీడీపీ ల మధ్య పొత్తు కుదరడంతో
తోడల్లుడు చంద్రబాబు నాయుడుతో పొసగని ఆయన నందమూరి హరికృష్ణ పెట్టిన ‘అన్న
తెలుగుదేశం’లో చేరారు. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో
వెంకటేశ్వరరావు 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. భర్తతో
పాటే పురందేశ్వరి కాంగ్రెస్లో చేరారు.
రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్
కుమార్తె కాంగ్రెస్లో చేరడం నాడు అందరినీ విస్మయానికి గురిచేసింది. 2004
లోక్సభ ఎన్నికల్లో బాపట్ల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన
పురందేశ్వరి సమీప బంధువు, టీడీపీ సిట్టింగ్ ఎంపీ దగ్గుబాటి రామానాయుడుపై
94,082 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2006
నుంచి 2009 వరకు కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల
పునర్విభజనతో బాపట్ల ఎస్సీలకు రిజర్వు కావడంతో 2009 లోక్సభ ఎన్నికల్లో ఆమె
కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖపట్నం నుంచి బరిలోకి దిగి ప్రజారాజ్యం పార్టీ
అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పై 66,686 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మన్మోహన్ సింగ్ రెండో మంత్రివర్గంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖల
సహాయ మంత్రిగా ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి
రాజీనామా చేశారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట,
విశాఖపట్నం స్థానాల నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. బీజేపీ మహిళా మోర్చా
ఇన్ఛార్జిగా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగానూ వ్యవహరించారు.
ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒడిశా వ్యవహారాల బాధ్యురాలిగా
ఉన్నారు.