మణిపుర్లో హింస
మణిపుర్లో అల్లరి మూకలు ఆయుధాల లూటీకి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
అల్లరి మూకలను భద్రతా బలగాలు సమర్థంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ
క్రమంలో ఓ దుండగుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనలతో
అల్లాడుతున్న మణిపుర్లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్
(ఐఆర్బీ) వద్ద ఉన్న ఆయుధాలను లూటీ చేసేందుకు యత్నించాయి. అయితే, ఈ
ప్రయత్నాన్ని భద్రతా దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా తలెత్తిన
ఘర్షణల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ధౌబాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని
అధికారులు వెల్లడించారు.
అల్లరి మూకలు వందల సంఖ్యలో వచ్చి ఐఆర్బీ బెటాలియన్ పోస్ట్‌పై దాడికి దిగినట్లు
తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తోనే ఇదంతా చేసినట్లు స్పష్టమవుతోంది. ఐఆర్బీ దళాలకు
మద్దతుగా సైన్యం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇతర భద్రతా దళాలు రాకుండా రోడ్లను
ముందుగానే తవ్వేశాయి. అయితే, అసోం రైఫిల్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు
మాత్రం ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. దీంతో ముప్పు తప్పినట్లైంది. భద్రతా బలగాలు
మూకుమ్మడిగా అల్లరిమూకలను చెదరగొట్టాయి. ఈ క్రమంలో ఓ దుండగుడు ప్రాణాలు
కోల్పోయాడు.