హైదరాబాద్ : బీజేపీలో నెలకొన్న అలజడిని సానుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్
పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీసీ నాయకుడిని అధ్యక్ష పదవి నుంచి
తప్పించడంపై విమర్శలు గుప్పిస్తున్న హస్తం నాయకులు కేసీఆర్‌కు అనుకూలమైన
కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడిని
మార్పు చేయడంపై అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్
పార్టీ తెరవెనుక రాజకీయం మొదలైంది.
బీజేపీ అసంతృప్తులకు హస్తం గాలం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చేరికలపై హస్తం పార్టీ
ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీలో నెలకొన్న అలజడిని తమకు అనుకూలంగా
మార్చుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్ని
రోజులుగా బీజేపీ నాయకులు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు లావాలా
బైటికొస్తున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన
కలిగించేటట్లు వ్యవహరిస్తూ వచ్చాయి. ఇదే సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు తీరును
వ్యతిరేకిస్తున్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్
గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్లిన
నాయకులను తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించుకోవాలన్న ఆలోచనతో పీసీసీ ముందుకు
వెలుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో బండి సంజయ్ వ్యతిరేక వర్గంగా
కొనసాగుతున్న నేతలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే
ఇప్పటికిప్పుడు హస్తం పార్టీలోకి రావడానికి కొందరు నాయకులు వెనుకంజ
వేస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే
అరుణ తదితరులను.. పార్టీలోకి తీసుకురావడం వల్ల మరింత ఊపు వస్తుందని కాంగ్రెస్
వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్ ఆకర్ష పేరుతో అత్యంత రహస్యంగా మంతనాలు
కాంగ్రెస్‌లోకి చేరికల కోసం కసరత్తు కొనసాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో
కొనసాగుతున్న ఈ సంప్రదింపులు.. అత్యంత రహస్యంగా జరుపుతున్నారు. బీజేపీకి
చెందిన ఇద్దరు కీలక నాయకులతో.. హస్తం నేతలు సంప్రదింపులు బయట రాష్ట్రాలలో
జరిగినట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణలో ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం
ఉన్న కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజు ద్వారా కాంగ్రెస్ నుంచి
బయటకు వెళ్లిన నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ జోడోయాత్ర, కర్ణాటక ఎన్నికల ఫలితాలు సందర్భంగా హస్తం పార్టీలో జోష్
వచ్చింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. దీనిని
మరింత బలోపేతం చేసుకుని అధికారం చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో పార్టీ ముందుకు
వెళ్తోంది. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి
జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన
రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో కీలక
నేత.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పుపై కొంత సంతృప్తిగా ఉన్నప్పటికి..
ఈనెల 8 తర్వాత అభిప్రాయాన్ని చెబుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.