విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో రైతులు పండించే జయబోండాలు ధాన్యం రకానికి కేరళలో డిమాండ్ బాగానే ఉంది. కేరళ ప్రభుత్వం ఈ రకం ధాన్యాన్ని సరఫరా చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాల మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఇటీవల ఏపి పర్యటనకు వచ్చిన కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనిల్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాపంపిణీ వ్యవస్థను పరిశీలించారు. బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాలను ప్రత్యేక వాహనాల్లో లబ్ది దారుల ఇళ్లకు ఏపి ప్రభుత్వం సరఫరా చేస్తున్న విధానాన్ని చూసి మెచ్చుకున్నారు.
అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని రకాల నిత్యావసరాలను పరస్పరం సరఫరా చేసుకోవడం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును కేరళ పర్యటనకు ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్ , ఏపి డెయిరీ ఎండీ అహ్మద్ బాబు ఇతర ఉన్నతాధికారులతో కూడిన బృందం కేరళలో పర్యటించింది. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం నాడు జరిగిన సమావేశంలో కొన్ని కీలకాంశాలపై చర్చించారు. ప్రధానంగా ఏపిలో పండే జయ రకం ధాన్యానికి తమ వద్ద బాగా డిమాండ్ ఉంటుందని , తమ అవసరాలకు సరిపడ సరఫరా చేయాలని కేరళ మంత్రి అనిల్ ఏపి మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కోరారు. జయ బోండాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అందించాలన్నారు. మంత్రి అనిల్ విజ్ఞప్తి మేరకు మంత్రి కారుమూరి సంసిద్ధత వ్యక్తం చేశారు.
ధాన్యం తో పాటు ఏపి మార్క్ ఫెడ్ ద్వారా కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు తదితర నిత్యావసరాలను కూడా సరఫరా చేయాలని కోరారు. దీనిపై మంత్రి కారుమూరి సానుకూలంగా స్పందించారు. ప్రజలకు మేలు చేసేందుకు తమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలను వారికి వివరించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనం కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపి మార్క్ ఫెడ్ సరఫరా చేసే నిత్యావసరాలను తమ రాష్ర్టంలోని కేరళ పౌర సరఫరాల సంస్థ (సప్లైకో) కు చెందిన మావెల్లి స్టోర్స్ ద్వారా వినియోగదారులకు అందించనుంది.
కేరళ ప్రభుత్వం తో కుదిరిన ఈ ఒప్పందంతో ఏపి లోని జయబోండాలు పండించే రైతులకు మద్దతు ధర లభించి పెద్ద ఎత్తున మేలు జరుగనుంది. అంతే గాక రెండు రాష్ర్టాల ప్రయోజనాల కోసం పరస్పర సహాయ సహకారాలు అందించుకునేదుకు వీలుంటుంది. మా వెల్లి స్టోర్స్ ను సందర్శించిన మంత్రి కారుమూరి రెండు రాష్ర్టాల మధ్య నిత్యావసరాల సరఫరా అవగాహన ఒప్పందం అనంతరం కేరళ మంత్రి అనిల్, ఆ రాష్ర్ట ఉన్నతాధికారులతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అధికారుల బృందం మావెల్లి స్టోర్స్ ను సందర్శించింది. స్టోర్స్ ద్వారా వినియోగదారులకు నిత్యావసరాల సరఫరాను పరిశీలించారు.ఏపిలో పండే మిర్చి, కంది, మినుము,శనగ, ధనియాలను మార్క్ ఫెడ్ ద్వారా మార్క్ ఫెడ్ బ్రాండ్ పేరు తో అక్కడి స్టోర్స్ కు అందిస్తామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు.