గుజరాత్‌లోని మోర్బి పట్టణంలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 130మందికి పైగా జలసమాధి కాగా.. ఇంకా అనేకమంది బురద నీటిలో కూరుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని మోర్బి పట్టణంలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 130మందికి పైగా జలసమాధి కాగా.. ఇంకా అనేకమంది బురద నీటిలో కూరుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే, నదిలో పడి గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగించిన అధికారులు ఈరోజు సాయంత్రం నిలిపివేశారు. మళ్లీ మంగళవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బ్రిటిష్ కాలంలో మచ్చూ నదిపై నిర్మించిన ఈ చారిత్రక వంతెన కుప్పకూలిపోవడానికి కారణం సందర్శకుల తాకిడి ఎక్కువ కావడం వల్లేనని ఫోరెన్సిక్ లేబోరేటరీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరమ్మతు పనుల కారణంగా ఏడు నెలల పాటు మూసి ఉన్న ఈ వంతెనకు ప్రారంభమైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 134మంది పైగా మృతిచెందగా.. వీరిలో 47మంది చిన్నారులే ఉండటం మరో విషాదకరం. చిన్నారుల్లో రెండేళ్ల వయసు ఉన్నవారూ ఇద్దరు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ తీగల వంతెన నిర్మాణం నుంచి ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్‌ను సేకరించింది. ఇందుకోసం గ్యాస్ కట్టర్లు వినియోగించినట్టు సమాచారం. ఈ వంతెన మరమ్మతు బాధ్యతలను గుజరాత్‌కు చెందిన ఒరెవా గ్రూప్ చేపట్టింది. సీఎఫ్ఎల్ బల్బులు, గోడ గడియారాలు, ఈ-బైక్‌లు తయారు చేసే కంపెనీగా పేరొందిన ఈ గ్రూప్‌నకు.. నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేకపోవడం గమనార్హం. అలాంటి కంపెనీకి వందేళ్ల పురాతన బ్రిడ్జి మరమ్మతు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా దక్కిందన్న అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని రాజ్‌కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు. వీరిలో ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ బుకింగ్ క్లర్కులు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ వంతెనను పునఃప్రారంభించే అంశంపై ఒరెవా కంపెనీ సిబ్బంది ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించలేదని మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ సందీప్‌సిన్హ్ జాలా అన్నారు. అలాగే, ఆ కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై ఒరెవా అధికారులు ఇంకా స్పందించలేదు. ఒరెవా కంపెనీ మార్చి నెలలో ఈ వంతెన మరమ్మతు చేపట్టింది.
దాదాపు ఏడు నెలల తర్వాత గుజరాత్ నూతన సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 26న పునఃప్రారంభించారు. పురపాలక సంఘం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ కాలేదు. 15ఏళ్ల కాలానికి వంతెన నిర్వహణ, మరమ్మతు పనుల్ని ఆ కంపెనీకే అప్పగించారు. ఇప్పటివరకు ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆరు ప్లాటూన్ల ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీతో పాటు స్థానిక సహాయక బృందాలు సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ దుర్ఘటన రాజ్‌కోట్ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్‌జీ కుందారియా కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబంలో మొత్తం 12 మంది మృతి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మోర్బిలో తీగల వంతెన కుప్పకూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ట్వీట్ చేశారు. మోర్బిలో తీగల వంతెన కూలిన ఘటనతో అహ్మదాబాద్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడి అటల్ బ్రిడ్జిపై ఒకేసారి 3వేల మందికి మించి అనుమతించరాదని నిర్ణయించింది.