చైనాలో ఓ వ్యక్తి లాటరీలో 30 మిలియన్ డాలర్లు(రూ.248 కోట్లు) గెలుచుకున్నారు. ఇంతటి జాక్పాట్ తగిలితే ఎవరైనా ఉబ్బితబ్బిబ్బవుతారు. కానీ, ఆయన మాత్రం కనీసం భార్యపిల్లలకూ ఈ విషయం చెప్పలేదట. కారణం.. ఈ డబ్బు వారిని ఎక్కడ అహంకారులు, సోమరులుగా మార్చేస్తుందనే భయం.
బీజింగ్: చైనా లో ఓ వ్యక్తి లాటరీలో 30 మిలియన్ డాలర్లు(రూ.248 కోట్లు) గెలుచుకున్నారు. ఇంతటి అదృష్టం తగిలితే ఎవరైనా ఉబ్బితబ్బిబ్బవుతారు. దీంతోపాటు ఆనందభరిత వార్తను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కానీ, ఆయన మాత్రం కనీసం భార్యపిల్లలకూ ఈ విషయం చెప్పలేదట. కారణం.. ఈ డబ్బు వారిని ఎక్కడ అహంకారులు, సోమరులుగా మార్చేస్తుందనే భయం. స్థానిక వార్తాసంస్థ వివరాల ప్రకారం.. గ్వాంగ్జి జువాంగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. 80 యువాన్లు(11 డాలర్లు) పెట్టి 40 లాటరీ టిక్కెట్లు కొన్నారు. ఈ క్రమంలోనే జాక్పాట్ తగిలింది. అయితే.. ఇప్పటికే ఆయన 5 మిలియన్ యువాన్ల(6.84 లక్షల డాలర్లు)ను ఓ ఛారిటీకి విరాళంగా ప్రకటించడం విశేషం.
కార్టూన్ వేషంలో వెళ్లారు..:అక్టోబర్ 24న ఆయన ప్రైజ్ మనీ చెక్కు అందుకున్నారు. అయితే, తన గుర్తింపును గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో.. ఆ సమయంలో ఆయన ఓ కార్టూన్ వేషంలో వెళ్లడం గమనార్హం. ‘నా భార్యకు, కుమారుడికి ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఇంత డబ్బు దక్కితే వారు తామను తాము ఎక్కువగా ఊహించుకుంటారని నా ఆందోళన. పైగా.. కష్టపడి పని చేయరు. చదువు వదిలేస్తారు’ అని లాటరీ విజేత చెప్పినట్లు వార్తా సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. పన్నులు, విరాళం పోగా ఆయనకు 24 మిలియన్ డాలర్లు మిగిలాయి. ‘లాటరీలు కొనడం నా హాబీ. పదేళ్లుగా క్రమం తప్పకుండా కొంటున్నా. అవే నా ఆశాకిరణాలు. అయితే, నా కుటుంబం ఇవేమీ పట్టించుకోదు. ఈ డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కొద్దిరోజుల తర్వాత ప్లాన్ చేసుకుంటా’ అని వివరించారు.