గుజరాత్ మోర్బీ ఘటనలో ఇప్పటివరకూ 134 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురి జాడ తెలియాల్సి ఉంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
వాషింగ్టన్: గుజరాత్లో మోర్బీ దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. దీనిపై ప్రపంచ దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు, గుజరాత్ వాసులకు అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘తీగల వంతెన దుర్ఘటన దిగ్భ్రాంతికరం. ఈ విచార సమయంలో భారతీయులు, గుజరాత్ ప్రజల గురించే మా ఆలోచనంతా. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు జిల్, నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలున్నాయి. రెండుదేశాల పౌరుల మధ్య వీడదీయలేని అనుబంధం ఉంది. ఈ క్లిష్ట సమయంలో మా సహకారాన్ని కొనసాగిస్తాం’ అని బైడెన్ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. మోర్బీ ఘటనలో ఇప్పటివరకూ 134 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 5-10 మంది జాడ ఇంకా కనిపించడం లేదని తెలుస్తోంది. దాదాపు 125 మందిని మోయగల సామర్థ్యం వంతెనకు ఉంది. కానీ కూలిపోయే సమయంలో దానిపై 400 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించిన జనం, ఆకతాయిల చేష్టలు ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు.