నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార ఘట్టానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చివరి రోజు ఓటర్లను తమవైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మోహరించింది. పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్న నేతలు.. ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. నెల రోజులుగా ప్రచారాలు, రోడ్‌షోలు, ర్యాలీలతో హోరెత్తించిన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఈ రెండ్రోజుల పాటు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారంలో తొలి నుంచి దూకుడుగా ఉన్న అధికార తెరాస గ్రామగ్రామాన ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. చండూరులో సీఎం సభ తర్వాత ఉత్సాహంతో ఉన్న గులాబీదళం అదే ఊపును పోలింగ్ వరకు కొనసాగించాలని భావిస్తోంది. చివరి నిమిషం వరకు క్లస్టర్లలోనే ఉండాలని ఇన్ఛార్జీలకు పార్టీ ఆదేశాలు జారీ చేయగా ప్రతి ఓటరును టచ్ చేసేలా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ
క్రమంలోనే ఓవైపు అభ్యర్థి కూసుకుంట్ల ప్రచారం సాగిస్తుండగా మరోవైపు శ్రేణులతో కలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నాంపల్లి మండలం పసునూరులో మహిళలతో భేటీ అయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరాస సర్కార్‌కు అండగా ఉండాలని కోరారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సంస్థాన్ నారాయణపురం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్ తన జన్మదిన వేడుకలనూ గరికగడ్డ తండాలో గిరిజనుల మధ్యే జరుపుకున్నారు. తెరాస అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.