రూ.29.20 కోట్లుగా ఆస్తుల ప్రకటన
సొంతపార్టీ కేఆర్పీపీ అభ్యర్థిగా బరిలోకి
ఫుట్‌బాల్ గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్
తనపై నమోదైన కేసుల్లో ఒక్కదాంట్లోనూ శిక్ష పడలేదని అఫిడవిట్లో పేర్కొన్న గాలి
గాలి సహా 16 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
బెంగుళూరు : మైనింగ్ కింగ్, బీజేపీ మాజీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల బరిలో నిలిచారు. కొప్పళ జిల్లా గంగావతి
నియోజకవర్గం నుంచి సొంత పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి ప్రకాశ పార్టీ’
(కేఆర్పీపీ) అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా తన
ఆస్తిని రూ. 29,20,44,317గా ప్రకటిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఆయన భార్య లక్ష్మీ అరుణ పేరిట రూ. 96.26 కోట్ల నగదు, డిపాజిట్లు ఉన్నట్టు
పేర్కొన్నారు. రూ. 32 లక్షల విలువైన వెండి, రూ. 7.93 కోట్ల విలువైన బంగారు
ఆభరణాలు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే, భార్య పేరుతో 258 కేజీల వెండి,
రూ. 16.44 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం ఉన్నాయి. స్థిరాస్తులు, పిత్రార్జితం
విలువ రూ. 8 కోట్లకుపైనేనని పేర్కొన్నారు.
పదో తరగతి వరకు చదువుకున్న ఆయన వద్ద రూ. 1.33 లక్షల నగదు ఉంది. వివిధ నేరాలకు
సంబంధించి తనపై నమోదైన కేసులకు సంబంధించి ఒక్క దాంట్లోనూ శిక్ష పడలేదని
అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, గాలి జనార్దన్‌రెడ్డి పార్టీ కేఆర్‌పీపీకి
ఎన్నికల కమిషన్ ‘ఫుట్‌బాల్’ గుర్తును కేటాయించింది.
క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశం
గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు, విక్రయానికి సంబంధించి కేసులను
విచారిస్తున్న న్యాయస్థానం గాలి జనార్దన్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
చేయాలని ఆదేశించింది. గాలి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్ర సహా
మొత్తం 16 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి
విచారణను జూన్ 24కు వాయిదా వేసింది.