గుజరాత్లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి బ్రిజేశ్ మీర్జా వెల్లడించారు. ప్రత్యేక బృందంతో తాజా ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది.అహ్మదాబాద్: గుజరాత్లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు గుజరాత్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బ్రిజేశ్ మీర్జా వెల్లడించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. ‘‘ దాదాపు140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేసి సందర్శకులను అనుమతించాం. అంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడం బాధాకరం.ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపడతాం’’ అని బ్రిజేశ్ మీర్జా మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ తీగల వంతెనకు మరమ్మతులు చేపట్టిన తర్వాత ఫిట్నెస్ ధ్రృవపత్రం జారీ చేయకముందే పర్యాటకులకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా.. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తాజా ఘటన నేపథ్యంలో సీఎం భూపేంద్ర పటేల్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు. హోం మంత్రి అమిత్షా కూడా అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని గురించి ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500మంది ఉన్నారని, 100 మంది వరకు నదిలో పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.