అక్టోబరు నెలలో తొలి 9 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 200 ఘటనల్లో పశువులను రైళ్లు ఢీ కొట్టాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ తరహా ఘటనలు 4000 వరకు జరిగాయని రైల్వేశాఖ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్శర్మ తెలిపారు.
దిల్లీ: ఈ నెలలో తొలి 9 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 200 ఘటనల్లో పశువులను రైళ్లు ఢీ కొట్టాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈతరహా ఘటనలు 4000 వరకు జరిగాయని రైల్వేశాఖ అధికారి అమితాబ్శర్మ తెలిపారు. అక్టోబరు 1న ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రారంభమైన వందేభారత్ రైళ్లు పశువులను ఢీ కొట్టిన ఘటనలు మూడుసార్లు జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. ట్రాక్‌కు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 40శాతం మేర పనులు పూర్తయినట్లు చెప్పారు. అయితే దారి పొడవునా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వ్యయంతో కూడుకున్న పని అని, అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్న చోట్ల మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ట్రాక్‌కి ఒకవైపు ఇళ్లు..మరోవైపు డెయిరీఫాంలు ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువగా ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ప్రాంతాలకు అధికారులు నేరుగా వెళ్లి..గ్రామ సర్పంచులతో మాట్లాడి, ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నామని అమితాబ్ శర్మ చెప్పారు. ఫెన్సింగ్ ఉన్నప్పటికీ పట్టాలు దాటడం సులువు అవుతుందనే ఉద్దేశంతో కొన్నిసార్లు అక్రమంగా దారులు చేసుకుంటున్నారని, దీనివల్ల మూగజీవాలు బలవుతున్నాయన్నారు. 2020-21 సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైళ్లు పశువులను ఢీ కొట్టిన ఘటనలు 26,000 జరగ్గా..
అందులో నార్త్ సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో 6500, నార్త్ రైల్వే జోన్ పరిధిలో 6,800 ఘటనలు జరిగినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పశువులు ఢీ కొన్నప్పటికీ వాటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైళ్ల ముందుభాగాలను గట్టి ఫైబర్‌తో తయారు చేసినట్లు అమితాబ్ చెప్పారు. ఒక వేళ ముందుభాగం దెబ్బతిన్నప్పటికీ రూ.10 వేల నుంచి రూ.15 వేల తక్కువ మొత్తంతో మళ్లీ భాగాలను మార్చుకోవచ్చని అన్నారు. పశువుల వల్ల జరిగిన ప్రమాదాలతో కొన్నిసార్లు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, ఇంకొన్ని సందర్భాల్లో రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని, అందువల్ల యథేచ్ఛగా పశువులను విడిచిపెట్టకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.