కేంద్రంలోని భాజపా పాలనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామిక అధికారాన్ని సమాజంలోని ఓ వర్గం తమ చేతుల్లో ఉంచుకుంటోందని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే.. దేశం అధ్యక్ష తరహా పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు.
కోల్కతా: కేంద్రంలోని భాజపా పాలనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామిక అధికారాన్ని సమాజంలోని ఓ వర్గం తమ చేతుల్లో ఉంచుకుంటోందని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే.. దేశం అధ్యక్ష తరహా పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో భాగంగా సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సమక్షంలో మమత ఈ మేరకు ప్రసంగించారు.
‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాన్నంతా ఓ వర్గమే తన చేతుల్లో ఉంచుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రజలను అన్యాయం నుంచి రక్షించాలి. వారి అభ్యర్థనలను వినాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే.. ఎన్యూజేఎస్ను ప్రపంచంలోని ముఖ్యమైన సంస్థల్లో ఒకటిగా ప్రశంసించారు. రెండు నెలల్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో చూపించారంటూ.. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ను ఈ సందర్భంగా అభినందించారు.