‘విశాఖ ఉక్కు’పై కేంద్ర మంత్రి ప్రకటన కొత్త ఆశలు
రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
గుంటూరు : విశాఖ ఉక్కుపై కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే చేసిన ప్రకటన
కొత్త ఆశలు రేపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కు
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఇప్పటికిప్పుడు ముందుకెళ్లే ఆలోచన లేదని
కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై పవన్ స్పందించారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన
కొత్త ఆశలు రేపిందన్నారు. ‘‘విశాఖ ఉక్కుపై రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని
కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని కోరాం. కేంద్రం వద్దకు వెళ్లాలనే ప్రతిపాదనపై
వైసీపీ నేతలు స్పందించలేదు. వైసీపీ నేతలు పరిశ్రమను కాపాడతామనే మాట
చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి
లేదు. విశాఖ ఉక్కు తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడి ఉంది. కేంద్ర హోం మంత్రి
అమిత్ షాను కలిసినప్పుడు విశాఖ ఉక్కుతో తెలుగు వారి భావోద్వేగాన్ని తెలిపాను.
విశాఖ ఉక్కును ప్రత్యేకంగా చూడాలని కోరా. ప్రైవేటీకరణ వద్దన్నప్పుడు బీజేపీ
నేతలు సానుకూలంగా స్పందించారు. కొద్ది రోజులుగా పొరుగు రాష్ట్రం విశాఖ
ఉక్కుపై స్పందిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.
గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే విశాఖ
స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పటికిప్పుడు విశాఖ
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి
ముందుకెళ్లడం లేదు. దానికంటే ముందు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
(ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేసే పనిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని
కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి
పెట్టాం. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పనిచేసే ప్రక్రియ జరుగుతోంది.
దీనిపై ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం. ఆర్ఐఎన్ఎల్
అధికారులతో భేటీ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం ఓ
ఎత్తుగడ మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం
చేశారు. విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని పవన్
విమర్శించారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, కేంద్రమంత్రి
ప్రకటన ఆశాజనకంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు అనేది తెలుగువారి
భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, 32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా
సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ అని పవన్ కల్యాణ్
అన్నారు. ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్
లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని
కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన
సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరె్స్ట-ఈవోఐ)ను
ఆహ్వానించిన నేపథ్యంలో దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించింది.
బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా, అటు రాజకీయంగా కేంద్రంలోని
బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినట్లవుతుందని, ప్రైవేటీకరణను అడ్డుకున్నామని
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా మైలేజీ వస్తుందని బీఆర్ఎస్ చీఫ్
కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల
15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ
బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే
పాల్గొనాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి
సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు
అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారుల బృందం ఒకటి
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి, అధ్యయనం చేయనుంది.
అక్కడి అధికారులను సంప్రదించి, ఈవోఐలో పాల్గొని, బిడ్‌ను దక్కించుకున్న
సంస్థలకు అందే ప్రతిఫలం ఏమిటి? కేవలం స్టీల్‌ను నేరుగా తీసుకోవడమేనా? ఇంకేమైనా
ప్రయోజనాలుంటాయా? అనే అంశాలను పరిశీలించనుంది. విశాఖ ఉక్కును
ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విమర్శిస్తూ ఇటీవల తెలంగాణ మంత్రి
కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘విశాఖ ఉక్కు..
తెలుగు ప్రజల హక్కు’ అని ఆయన అందులో పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఏపీ నేతలు
విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న మార్గాలను కేసీఆర్‌కు
వివరించారు. ఈ క్రమంలోనే ఈవోఐలో పాల్గొనాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం.
బీఆర్ఎస్కు రాజకీయ లబ్ధి : విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్‌లో పాల్గొనడం
ద్వారా బీఆర్ఎస్కు రాజకీయంగా మైలేజీ వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు
అంటున్నారు. మోదీ సర్కారు లాభదాయక సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే విపక్షాలు
గగ్గోలు పెట్టడమే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు బీఆర్ఎస్ ఏకంగా
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బిడ్డింగ్‌లో పాల్గొంటోందని అందరూ
భావిస్తారన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ ఈ బిడ్డింగ్‌ను
దక్కించుకుంటే నైతికంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విజయం
సాధించినట్లవుతుందని భావిస్తున్నారు.