ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పూనూరి గౌతమ్ రెడ్డి
విజయవాడ : శ్రీదేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి మే
మూడో తేదీ వరకు జరగనున్న సహస్ర చండీయాగం, కుంభాభిషేకం కార్యక్రమాలు ప్రజలకు,
రాష్ట్రానికి ఎంతో శుభకరమని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్
పూనూరి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి పక్కన
ఉన్న శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో ఆయన మాట్లాడారు. సహస్ర చండీయాగం సందర్భంగా 72 అడుగుల ఎత్తైన మహా
చండి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. ఎంతో
మహిమాన్వితమైన శ్రీదేవి కరుమారి అమ్మన్ ఆశీస్సులు ప్రజలపై ఉంటాయన్నారు. సహస్ర
చండీయాగం కార్యక్రమానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తామని చెప్పారు.
పవిత్ర కృష్ణా నది తీరాన అమ్మవారి సన్నిధిలో జరిగే సహస్ర చండీయాగం వలన ప్రజల
ఇబ్బందులు తొలగిపోతాయని ఆకాంక్షించారు. కరోనావంటి విపత్తుల నుండి ప్రజలను
కాపాడేందుకు సహస్ర చండీయాగం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సేవ్ టెంపుల్స్ భారత్
సంస్థ అధ్యక్షులు, ప్రముఖ గజల్ కళాకారుడు మూడు సార్లు గిన్నిస్ బుక్ వరల్డ్
రికార్డుల్లో స్థానం సంపాదించిన గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీదేవి కరుమారి
అమ్మన్ ఎంతో మహిమాన్విత శక్తి గల పరాశక్తి అన్నారు. ప్రజలకు శ్రీదేవి కరుమారి
అమ్మన్ అమ్మవారు కరుణాకటాక్షాలను అందజేయాలని కోరారు. దేవాలయాలను
సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. శక్తిపీఠం పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27 నుండి మే 3
తేదీ వరకు తలపెట్టిన సహస్ర చండీ యాగం ప్రత్యేకతను వివరించారు. 72 అడుగుల
ఎత్తున మహాచండి విగ్రహం దేశంలోనే మొట్టమొదటిసారిగా సహస్ర చండీయాగం సందర్భంగా
ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సహస్ర చండీయాగములో పాల్గొనే వారికి అమ్మవారి
అనుగ్రహం ఎల్లవేళలా తోడు ఉంటుందని చెప్పారు. శ్రీదేవి కరుమారి అమ్మన్
భక్తురాలు సునీత మాట్లాడుతూ ఇక్కడ సహస్ర చండీయాగం నిర్వహిస్తుండటం విజయవాడ
ప్రజల పూర్వజన్మ సుకృతం అని అన్నారు. మహిళలు అమ్మవారి కుంకుమార్చన
చేసుకోవచ్చని చెప్పారు. వెయ్యి మంది మహిళలకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర
జాకెట్లు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి పీఠం పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు, శ్రీ విష్ణు పారాయణ మండలి కన్వీనర్ ఎమ్ సత్య
శ్రీహరి, ఆలయం ట్రస్ట్ కోశాధికారి జ్ఞానేశ్వర్, ఆలయ అర్చకులు దీక్షితులు,
తదితరులు పాల్గొన్నారు.