ప్రస్తుతం చైర్ కార్లతో నడుస్తున్న వందేభారత్ రైళ్లు
ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున మొత్తం 80 రైళ్లకు ఆర్డర్
టిటాగఢ్ వ్యాగన్స్‌తో కలిసి రైళ్లను తయారుచేయనున్న ‘భెల్’
35 ఏళ్లపాటు వార్షిక నిర్వహణ విధులు కూడా
భారత ప్రభుత్వ సంస్థ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) వందేభారత్ రైళ్ల
సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఒక్కో రైలుకు రూ. 120 కోట్ల చొప్పున మొత్తం
రూ.9600 కోట్ల ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ కన్షార్షియంలో భాగస్వామిగా ఉన్న
టిటాగఢ్ వ్యాగన్స్‌తో కలిసి భెల్ ఈ రైళ్లను తయారు చేయనుంది. 35 ఏళ్ల కాలానికి
వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (ఏఎంసీ) కూడా ఇందులో ఉన్నట్టు భెల్ తెలిపింది.
కండిషన్స్ అగ్రిమెంట్ ప్రకారం 80 స్లీపర్ క్లాస్ వందేభారత్ రైళ్లను 72 నెలల్లో
అంటే ఆరేళ్లలో సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 35 ఏళ్లపాటు వాటి నిర్వహణ
బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లలో
చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో స్లీపర్ క్లాస్
రైళ్లు నడపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్డర్లు
పిలవగా భెల్ దానిని దక్కించుకుంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్ల ప్రయాణం పగటి
పూటే సాగుతుండగా, స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులోకి వస్తే రాత్రుళ్లు కూడా
నడిపే వీలుంటుంది.