కడప : పవిత్ర రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య ఆత్మీయ
సహృద్భావాలను పరిమళింపజేస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ
మంత్రి, యస్.బి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని రహమతుల్లా వీధిలోని
ఉలమ ఆయిమ్మ కమిటీ (రిజిస్టర్డ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దావతే ఇఫ్తార్’ విందు
కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజద్ భాష తొలుత ఉలమ ఆయిమ్మ కమిటీ
నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్
మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్య కార్యమన్నారు.
కమిటీ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఉలమ ఆయిమ్మ
కమిటీ ఎన్నో కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మన్ననలు
పొందుతోందన్నారు. భవిష్యత్తులో కూడా కమిటీలో మరిన్ని సేవలందివ్వాలని
ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం గురించి మాట్లాడుతూ కులమతాలకు
అతీతంగా కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. పవిత్ర దైవారాధనకు,
ధార్మిక చింతనకు, దైవభక్తికి క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలం
అన్నారు. మనిషి సత్ప్రవర్తనలో నడవడానికి.. రంజాన్ ఉపవాసాలు ఉపకరిస్తాయన్నారు.
సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ,
సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య
ఉద్దేశ్యం అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ దైవం అనుసరించిన
మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలమ ఆయిమ్మ కమిటీ ప్రెసిడెంట్ మౌలానా
సయ్యద్ నిజాముద్దీన్ బుఖారి, సెక్రటరీ ముఫ్తి సయ్యద్ సలీం బుఖారి, వైసీపీ,
మైనారిటీ నాయకులు అఫ్జల్ ఖాన్, శుభాన్ బాషా, తెదేపా నేతలు శ్రీనివాసులురెడ్డి,
అమీర్ బాబు, స్థానిక కార్పొరేటర్ రిజ్వాన్, డివిజన్ ఇంచార్జి జిలానీ, మత
గురువులు, ముస్లిం ప్రముఖులు, ఉలమాలు, ఆయిమ్మాలు, మౌల్వీలు, ముఫ్తీలు, వైసీపీ
నాయకులు, మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.