ఎన్నికల అనంతరమే స్పష్టతనిచ్చే వైఖరితో రెండు పార్టీలు
బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యింది. ప్రచారాన్ని
ముమ్మరం చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతివ్యూహాలకు
పదనుపెడుతున్నాయి. వాగ్దానాల కుమ్మరింతపై పోటీపడతున్నాయి. అయితే, తమ
ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడంపై మాత్రం మౌనందాల్చాయి. విజయంపై ధీమా
వ్యక్తం చేస్తున్న బీజేపీ , కాంగ్రెస్ రెండింటిలోనూ ఇదే తీరు కనిపిస్తోంది.
ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తామో విడమరిచి చెబుతున్న రాజకీయ పార్టీలుతమ
ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరనే విషయంలో మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్న
పరిస్థితి కర్ణాటకలో నెలకొంది. ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ , కాంగ్రెస్‌ల
మధ్య కొనసాగుతోంది. బీజేపీలో యడియూరప్ప, బసవరాజ్ బొమ్మైలు కీలక నేతలు కాగా
తనకు 80ఏళ్లు పైబడినందున ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని యడియూరప్ప ఇప్పటికే
స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో మాత్రం సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్
వంటి సీనియర్లు సీఎం రేసులో ఉంటామని చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి
అభ్యర్థిపై అధికారిక ప్రకటన లేకుండానే ఈ రెండు పార్టీలు ఎన్నికలకు వెళ్తాయా
అనే అంశం ఆసక్తిగా మారింది.
కమలం..ఏమిటో వ్యూహం : బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సుమారు ఐదు దశాబ్దాలుగా
రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కర్ణాటకలో అధికారాన్ని సొంతం చేసుకునే
స్థాయికి బీజేపీని తీసుకురావడంలో కీలక పాత్ర ఆయనదేనని చెబుతారు. యడియూరప్పను
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన పార్టీ అధిష్ఠానం బసవరాజ్ బొమ్మైను ఆయన
స్థానంలో కొనసాగిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని,అయినప్పటికీ
రాజకీయాలకు దూరమైనట్లు కాదని యడియూరప్ప చెబుతున్నారు. పార్టీని మరోసారి
అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొంటున్నారు.
కర్ణాటకలో లింగాయత్ వర్గంలో గట్టి పట్టున్న నేత యడియూరప్ప. ఆయనతో పోలిస్తే
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఆ వర్గం ప్రజలను ఆకట్టుకునే చరిష్మా లేదనే
అభిప్రాయం ఉంది. పార్టీకి ఆ వర్గం మద్దతు లభించాలంటే యడియూరప్పను ప్రచారంలో
ముందుంచాల్సిందే. మరోవైపు వొక్కళిగ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మద్దతూ భాజపాకు
అవసరం. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి పేరును పార్టీ
ప్రకటించకపోవచ్చునని..మళ్లీ భాజపా విజయం సాధిస్తే బొమ్మైనే ముఖ్యమంత్రిగా
కొనసాగించే అవకాశాలే అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే,
పార్టీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాలి.
కాంగ్రెస్‌లో రామయ్య వర్సెస్ శివకుమార్ : ఇతర పార్టీలతో పోలిస్తే కర్ణాటక
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించగా పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌తో పాటు జి.పరమేశ్వర వంటి సీనియర్లు కూడా
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే
విషయమై శివకుమార్, పరమేశ్వరలు గతంలో పలు సందర్భాల్లో తమ మనసులో మాట
వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం కాంగ్రెస్ ఎప్పుడూ
ప్రకటించదని సిద్ధరామయ్య చెబుతున్నారు.