అక్కడ మెజార్టీ వస్తే అధికారం పక్కా
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వుడ్ స్థానాలు ప్రధాన పార్టీలకు
కీలకంగా మారాయి. మొత్తం 51స్థానాల్లో మెజార్టీ సీట్లు గెల్చుకున్న పార్టీనే
అధికారం చేపడుతుండడం.. ఆయా పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఫలితంగా ఈసారి ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి.. ఎక్కువ స్థానాలను
కొల్లగొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
కర్ణాటకలో రిజర్వుడ్ స్థానాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి.
మొత్తం 224 స్థానాలకు 51 సీట్లు రిజర్వు కాగా.. ఎస్సీలకు 36, ఎస్టీలకు 15
కేటాయించారు. ఆయా స్థానాలు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో..
మెజార్టీ రిజర్వుడ్ సీట్లు గెల్చుకున్న పార్టీనే అధికారం చేపట్టింది.
ఫలితంగా.. ఆయా చోట్ల గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును
పెడుతున్నారు.2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 51 రిజర్వు స్థానాల్లో..
బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నడిచింది. 2008లో యడియూరప్ప నేతృత్వంలోని
బీజేపీ 29 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది.ఆ
సమయంలో జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013లో..
పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన
కాంగ్రెస్.. 51 సీట్లకు 27 కైవసం చేసుకోవడం సహా అధికార పగ్గాలు చేపట్టింది. ఆ
సమయంలో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్
స్థానాలు 19కి పడిపోగా.. బీజేపీ 23 చోట్ల జయభేరి మోగించింది. ఎన్నికల అనంతర
పొత్తులో భాగంగా.. కాంగ్రెస్, జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేసినప్పటికీ.. అది ఎక్కువ కాలం నిలవలేదు. 2021లో తిరిగి బీజేపీనే అధికారంలోకి
వచ్చింది.తాజా ఎన్నికల్లో మెజార్టీ రిజర్వు స్థానాలను దక్కించుకోవడం సహా…
అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దళితులు, గిరిజనులు బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కాంగ్రెస్
నేత, మాజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. బీజేపీ సర్కారు ఇటీవల
తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానం.. సమాజంలో చీలిక తీసుకొచ్చేలా ఉందని ఆయన
మండిపడ్డారు. మరోవైపు.. రిజర్వేషన్ల వల్ల కీలక వర్గాలైన లింగాయత్‌లు,
వక్కళిగలు తమవైపే ఉన్నారని బీజేపీ ఎస్సీ మోర్చా నేత చలవాది నారాయణస్వామి
పేర్కొన్నారు. బీజేపీ సర్కారుపై వ్యతిరేకత అనేది.. విపక్షాల మదిలో మాత్రమే
ఉందని ఆయన వ్యాఖ్యానించారు.