యాదగిరిగుట్టలో ప్రారంభించిన రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయాలని పిలుపు
యాదగిరి గుట్ట : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్
వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ
చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన
చార్జింగ్ మెషిన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వ,
ప్రయివేటు భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్)ఏర్పాటు చేసిన మొదటి చార్జింగ్ కేంద్రం
ఇది. ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రికి
ఎలక్ట్రిక్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు
వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువ
యూనిట్ ధరతో వాహనాలు చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా
ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు పెంచేందుకు రెడ్కో సంస్థ అహర్నిహలు కృషి
చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ చార్జింగ్ కేంద్రాలు
ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో రెడ్కో సంస్థ సొంతంగా చార్జింగ్
కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇవి వాహనదారులకు
అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు పాలుపంచుకోవాలని,
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరింత ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో
వడాయిగూడెం సర్పంచ్ పోశెట్టి, చార్జింగ్ కేంద్రం యజమాని జగన్మోహన్ రెడ్డి
పాల్గొన్నారు.