విజయవాడ : రాహుల్ గాంధి పై అనర్హత వేటుకి నిరసనగా కేంద్ర ప్రభుత్వం మొండి
వైఖరిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
నాయకత్వంలో ఆదివారం సంకల్ప సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. విజయవాడ వన్ టౌన్
కాలేశ్వరం మార్కెట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. అనంతరం రుద్రరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వచ్చి
సత్యాగ్రహ దీక్ష శిబిరంలో కూర్చున్నారు. రుద్రరాజు గారు మాట్లాడుతూ కేంద్ర
ప్రభుత్వం రాహుల్ గాంధీగారిపై తప్పుడు విధానాలను అవలంబిస్తూ అక్రమంగా కేసులు
బనాయించడం కేవలం మోడీకి మాత్రమే చెల్లిందని తీవ్రంగా ఖండిచారు. మోడీ ప్రభుత్వ
విధానాలను దేశ ప్రజలు చీకొట్టే రోజు దగ్గరలోనే ఉంది అన్నారు. సిబిఐ, ఈడి,
ఇన్కమ్ టాక్స్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు
ఉపయోగిస్తూ దుర్వినియోగపరుస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య రహిత
విధానాలను రుద్దితే ప్రజలు తిరగబడతారని రుద్రరాజు హెచ్చరించారు.
ఈ సంకల్ప సత్యాగ్రహ దీక్షకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. సిపిఐ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మోడీ చేస్తున్న తప్పులు వల్ల దేశంలోని
ప్రపంచంలోను తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి అని, ఈ దేశాన్ని అప్రతిష్ట పాలు
చేసే విధంగా మోడీ చర్యలు ఉన్నాయని ఆయన తీవ్రంగా ఎండగట్టారు . ఆగమేఘాల మీద
రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటు వేయడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని రామకృష్ణ
ఆరోపించారు. విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యులు నరహరిశెట్టి
నరసింహారావు గారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు అవలంబిస్తే
దేశ ప్రజలు రాబోయే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వి
గురునాథం సహా తదితర సీనియర్ నాయకులు ప్రసంగించారు. సంకల్ప సత్యగ్రహ దీక్ష
శిబిరంలో అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరిశెట్టి నరసింహ రావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ
కార్యక్రమంలో లీగల్ సెల్, అధ్యక్షుడు వి గురునాథం, పి వై కిరణ్, కాజా
మొహిద్దీన్, బైడి నాగేశ్వరావు, మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, బేగ్,
ఇమ్రాన్, ఖుర్షిదా తదితరులు పాల్గొని సంకల్ప సత్యగ్రహ దీక్షను విజయవంతం చేశారు.