న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్‌గా ప్రారంభించారు. రాజ్‌నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్‌లో 18, అరుణాచల్ ప్రదేశ్‌లో 18, ఉత్తరాఖండ్‌లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్‌లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు.