ముగిసిన కవిత విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. కవిత ఈసారి అరెస్ట్
అవుతుందనే ఊహాగానాలకు తెరపడింది. ఉత్కంఠత ముగిసింది. మరోసారి 24వ తేదీన
విచారణకు పిలిపించే అవకాశముందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వెలుగు
చూసిన మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత రెండవ ఈడీ
విచారణ ముగిసింది. 11 గంటల సుదీర్ఘ సమయం తరువాత రెండవ విడత ఈడీ విచారణ
ముగిసింది. ఈ కేసులో నిందితుడైన అరుణ్ పిళ్లైతో కలిపి మద్యాహ్నం వరకూ ఈడీ
కవితను విచారించింది. ఇరువురినీ ఒకేసారి విచారించి ప్రశ్నల వర్షం
కురిపించింది. పిళ్లైను రిమాండ్ కు తరలించాక తిరిగి కవిత విచారణ ప్రారంభమైంది.
కాస్సేపటి క్రితం విచారణ ముగిసింది. అయితే మరోసారి ఈ నెల 24వ తేదీన విచారణకు
పిలవవచ్చని సమాచారం.
ఈడీ ప్రశ్నిస్తున్న అంశాలివే
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంతో పాటు మద్యం కుంభకోణంలో ఆమె
పాత్ర, నిందితులతో ఆమెకున్న సంబంధాలు, ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటాలు,
100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. అదే సమయంలో
అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు స్టేట్మెంట్ ఆధారంగా కూడా కవితను ఈడీ వివరాలు అడిగి
తెలుసుకుంది. ఇండో స్పిరిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా లేదా, విజయ్
నాయర్‌ని 2021 మార్చ్ 19,20 తేదీల్లో కలిశారా లేదా, సిసోడియాను కలిశారా,
మాట్లాడారా వంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించింది. మరోసారి
విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత పిటీషన్‌పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఈలోగా
ఆమెను అరెస్టు చేసి కస్టడీలో తీసుకోవాలనేది ఈడీ ఆలోచనగా ఉంది. అంటే 24వ తేదీ
విచారణలోగా ఆమె అరెస్టైతే ఆ తరువాత ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతుందనేది ఈడీ
వ్యూహంగా ఉంది.