మంగళగిరిపై ఎందుకో లోకేష్ తండ్రి గారికి ఆశలు?
వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడ ఓడిపోతే పరువు పోతుందనే దిగులు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పట్టుకుందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాజకీయ గొడవలతో వార్తల్లో ఇటీవల నిలిచిన సొంత నియోజకవర్గం కుప్పంపై మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సమీక్షల మీద సమీక్షలు జరుపుతున్నారని తెలిపారు.
కుప్పం సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయినా చంద్రబాబు మొన్నటి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వచ్చిన జనం స్థానికులు కాదనే మాటతో పాటు అనేక అభాండాలు పాలకపక్షంపై వేశారని చెప్పారు. తన పాత సొంత ‘ఒరిజినల్’ నియోజకవర్గం చంద్రగిరి మాదిరిగానే కుప్పం కూడా వచ్చే ఎన్నికల్లో తనను ఓడిస్తుందనే భయం బాబు కి పట్టుకున్నట్టు కనిపిస్తోందనన్నారు. నారావారిపల్లె మనిషిగా గుర్తింపు పొందిన ‘టీడీపీ స్థాపకుడి అల్లుడి’ని 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో సొంత చంద్రగిరి జనం ఓడించిన విషయం ఆయన మరవలేదన్నారు. రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న కుప్పంపై నారా వారి ఆందోళన అందుకేనేమో అంటూ అశ్చర్యం వ్యక్తం చేశారు.
1989 నుంచి 2019 వరకూ తనను గెలిపించిన కుప్పం ఓటర్లపై తెలుగుదేశం అధ్యక్షుడికి ఎన్ని అనుమానాలు అంటూ ఎద్దేవా చేశారు. 2019 వేసవి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా కుమారరత్నం లోకేష్ ఓడిపోయినప్పటి నుంచీ మంగళగిరి అసెంబ్లీ స్థానంలో పార్టీ కార్యక్రమాలు పెరిగిపోయాయని తండ్రి చంద్రబాబు గురువారం అమరావతి సమీక్షలో తెగ సంబరపడిపోయారని చెప్పారు. ఎమ్మెల్సీగానే తండ్రి కేబినెట్ లో మంత్రిగా చేరిన ‘స్టాన్ఫర్డ్ ఎంబీఏ’ లోకేష్ ఒక్క విషయంలో మాత్రం తండ్రి బాటలో నడుస్తున్నట్టు కనిపించడం లేదన్నారు. అదేమంటే, తండ్రి చంద్రగిరిలో ఓడిపోయాక కొత్త సీటు కుప్పంలో సెటిలయ్యారు. కాని, లోకేష్ తాను ఓడినచోటే గెలవాలనే రీతిలో ప్రతి నెలా ఏదో కార్యక్రమం పెట్టుకుని మంగళగిరి వస్తున్నాడని చెప్పారు.
అదీగాక, అమరావతికి దగ్గరుండడంతో చినబాబుకు శ్రమలేకుండా పోయింది. పొత్తుల కారణంగానే మంగళగిరిలో తెలుగుదేశం బలహీనపడిందని, కిందటి ఎన్నికల్లో ఓడిపోయిందని చంద్రబాబు గారు ఈ సమీక్షలో చెప్పారు. వాస్తవానికి తెలుగదేశం పుట్టినప్పటి నుంచి చూస్తే, గతంలో మిత్రపక్షాలైన సీపీఎం, బీజేపీకి మంగళగిరి సీటు కేటాయించింది కేవలం 4 సార్లు మాత్రమే (1989, 94, 99, 2004). 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యాక కూడా తెలుగుదేశం ఎప్పటివో పొత్తుల వల్ల బలహీనమైందని ‘ఆధునిక తెలుగు చాణక్యుడు’ చంద్రబాబు చెప్పడం నమ్మశక్యంగా లేదు. రాష్ట్రంలోని 175 సీట్లలో తండ్రీకొడుకుల నియోజకవర్గాలపైనే పార్టీ అధినేత దృష్టి పెట్టడం తెలుగుదేశం పార్టీకి శుభసూచికం కాదన్నారు.