విశాఖపట్నం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు
వినియోగించుకొనే విషయమై ఓటర్లకు జిల్లా యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఓటరు
స్లిప్పులతో పాటు ఓటు వేసే విధానాన్ని తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ
చేస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలింగ్ రోజున ఓటు ఎలా వేయాలో తెలిపే
గోడపత్రికలను యంత్రాంగం అందుబాటులో ఉంచనుంది. మిగతా ఎన్నికలతో పోలిస్తే
ఎమ్మెల్సీ ఎన్నిక విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఓటు వేయడానికి గుర్తులు, ముద్రలు
ఉండవు. అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో అంకె వేయాల్సి ఉంటుంది. 2017లో
జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 11 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. 2007లో
2,849, 2011లో 5,282 ఓట్లు చెల్లని జాబితాలో చేరాయి. ఈ పరిస్థితి నివారణకు
ప్రస్తుతం యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఓటు ఎలా వేయాలంటే : ఓటు వేయడానికి బ్యాలెట్ పేపరుతో పాటు అందించే వైలెట్
స్కెచ్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. పెన్సిల్, బాల్‌పాయింట్ పెన్ను
ఉపయోగించకూడదు. మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న
గడిలో మాత్రమే 1 అనే అంకె వేయాలి. ఇతర అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో 2, 3, 4,
5.. ఇలా ఎంత మంది బరిలో ఉంటే అన్ని అంకెలను వేయొచ్చు. బ్యాలెట్ పేపరు
చెల్లుబాటు కావాలంటే అభ్యర్థుల్లో ఒకరికి ఎదురుగా 1 అంకెను ఉంచడం ద్వారా మొదటి
ప్రాధాన్యతను సూచించాలి. ఇతర ప్రాధాన్యతలు ఇవ్వడం తప్పనిసరి కాదు. 1,2,3 తదితర
సంఖ్యలతో పాటు రోమన్ అంకెలను కూడా వేయవచ్చు. ప్రాధాన్యతలను రాయడానికి ఆంగ్ల,
రోమన్ అంకెలను కలిపి వేయకూడదు. అభ్యర్థి పేరుకు ఎదురుగా ఒక సంఖ్యను మాత్రమే
ఉంచాలి. ఒకే సంఖ్యను ఒకరి కంటే ఎక్కువ మంది పేర్లకు ఎదురుగా రాస్తే ఆ ఓటు
చెల్లనిదిగా పరిగణిస్తారు. బ్యాలెట్ పేపరుపై పేరు, సంతకం, గుర్తు, బొటనవేలు
ముద్ర వేయకూడదు. ప్రాధాన్యతలను సంఖ్యల్లో మాత్రమే సూచించాలి. పదాల్లో
సూచించకూడదు. ప్రాధాన్యతను సూచించేందుకు టిక్, క్రాస్ మార్క్ పెడితే ఆ
బ్యాలెట్ పేపరు చెల్లుబాటు కాదు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై
ఓటర్లు తప్పనిసరిగా అవగాహన కల్పించుకోవాలి. ఎన్నిక ప్రక్రియను ప్రశాంత
వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 13న ఉదయం 8 నుంచి
సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్
కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ మల్లికార్జున
పేర్కొన్నారు.