హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లో
చేపట్టిన ధర్నాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా
వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ధర్నా చేయడం కాదు…ముందు తెలంగాణలో చేస్తేనే
ప్రజలు గుర్తిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అభద్రతా భావంతో
ఉన్నారని, వారు బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో
మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలే
కారణమని విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో
‘మహిళా గోస – భాజపా భరోసా’ పేరిట దీక్ష చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి
హోదాలో బండి సంజయ్ దీక్షను ప్రారంభించారు. అనంతరం దీక్షకు హాజరైన మహిళలను
ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. భారాస నేత
వేధింపుల వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఎన్సీఆర్బీ రికార్డుల మేరకు
తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు 17 శాతం పెరిగాయి. అన్ని విషయాల్లో తెలంగాణ
మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మహిళలే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులకు
కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఎన్డీయే ప్రభుత్వం మూడు సార్లు (1998,
1999, 2002) పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే
ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని ప్రతిఒక్కరు గమనించాలి. తెలంగాణ
కేబినెట్లో 3 శాతం కూడా మహిళా మంత్రులు లేరు. మహిళా రిజర్వేషన్లు అమలు
చేయాలంటూ ఇవాళ ఎమ్మెల్సీ కవిత, భారాస నేతలు దిల్లీలో ధర్నాకు దిగారు. ఇలాంటి
పరిస్థితుల్లో కవిత ముందు సీఎం కేసీఆర్ను ప్రశ్నించాలి. ఢిల్లీలో
కాదు..తెలంగాణలో ఉన్న ప్రగతిభవన్ ముందు ధర్నా చేయాలి. అప్పుడే ప్రజలు
గుర్తించేందుకు అవకాశం ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.