హైదరాబాద్ : ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో
రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర
ఆర్థికమంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రగతి భవన్లో సీఎం
కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు
తీసుకుంది. సొంత స్థలం ఉన్న పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల
చొప్పున సాయం అందించాలని, రెండో విడత గొర్రెల పంపిణీకి, పోడు భూముల పట్టాల
పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను ఆర్థికమంత్రి
హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన
దళితబంధుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న హరీశ్‌రావు.. రాష్ట్రంలో ఈ ఏడాది
1.30లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏటా ఆగస్టు
16న రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు వేడుకలు జరపాలని కేబినెట్
నిర్ణయించిందన్నారు.
పేదల సొంతింటి కోసం గృహలక్ష్మి పథకం : సొంత స్థలం ఉండి ఇల్లు
నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని పేదల కోసం కొత్త ‘గృహలక్ష్మి పథకం’
ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి
రూ.3లక్షలు ఆర్థిక సాయం అందిస్తారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.
రాష్ట్రంలో 4లక్షల మందికి.. నియోజకవర్గానికి 3వేల మందికి చొప్పున ఇళ్లు మంజూరు
చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఒక్కో ఇంటికి రూ.3లక్షలు యూనిట్ కాస్ట్‌గా
నిర్ణయించారు. ఒక్కో దఫా రూ.లక్ష చొప్పున 3 విడతల్లో రూ.3లక్షలు విడుదల
చేస్తారు.
4లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు : రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం
7.31లక్షల మంది లబ్ధిదారులను గతంలోనే గుర్తించారు. అందులో రెండో విడత పంపిణీ
చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రెండో విడత కార్యక్రమం ఏప్రిల్‌లో
ప్రారంభించి ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేయాలని మంత్రివర్గం ఆదేశించింది.
రాష్ట్రంలో 4లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,55,393 మంది అడవి బిడ్డలకు
పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు
గుర్తించిన లబ్ధిదారులకు పట్టాలు ముద్రించి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, ఈ
ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పోడు భూముల పంపిణీ వెంటనే
ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల
అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పూర్తయింది.ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్ల
క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59 కింద సకాలంలో కొందరు దరఖాస్తు
చేసుకోలేకపోయారని, కటాఫ్ డేట్ రిలాక్సేషన్ ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల నుంచి
విజ్ఞప్తులు అందాయి. ఆ విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని మరోసారి వారికి అవకాశం
ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీవో 58 కింద ఇప్పటి వరకు 1,45,668
మందికి పట్టాలు పంపిణీ చేశారు.