హైదరాబాద్ : హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఇకపై సంవత్సరం
మొత్తం సందర్శించొచ్చు. ప్రస్తుతం ప్రతి ఏడాది రాష్ట్రపతి శీతాకాల విడిది
అనంతరం 15 రోజులు మాత్రమే ప్రజలకు అనుమతిస్తున్నారు. ఈ నియమాన్ని మారుస్తూ
సోమవారం, ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 10 గంటల
నుంచి సాయంత్రం 5గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు రాష్ట్రపతి భవన్
అనుమతిచ్చింది. కార్యక్రమాన్ని ఉగాది రోజున (మార్చి 22న) ఉదయం 11గంటలకు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ప్రారంభిస్తారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు.
ప్రజల సందర్శన సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తరహా భద్రతా
వ్యవస్థను రూపొందించాలన్న అంశాలపై చర్చించేందుకు రాష్ట్రపతి కార్యాలయం అదనపు
కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గుప్తా హైదరాబాద్కు వచ్చారు. రాష్ట్రపతి
నిలయంలో పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15లోపు
ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయాన్ని తిలకించేందుకు
భారతీయులకు రూ.50, విదేశీయులకు రూ.250 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ నెల 14
నుంచి ఆన్లైన్లో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
అద్భుతం…ఆహ్లాదం : రాష్ట్రపతి నిలయాన్ని బొల్లారంలో 162 ఏళ్ల క్రితం నిజాం
నవాబు నిర్మించారు. తర్వాత బ్రిటిష్ పాలకులకు ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక
కేంద్రం స్వాధీనం చేసుకుని, రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా మార్చింది. నాటి
నుంచి భవనాన్ని వారసత్వ సంపదగా పరిరక్షిస్తోంది. భవనంలో ఎన్నో
ప్రత్యేకతలున్నాయి. విశాలమైన పచ్చిక బయలు, ఉద్యానవనాలు, పండ్లతోటలు, మెట్ల
బావులు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఆర్ట్ గ్యాలరీలో అప్పట్లో రైతులు ఉపయోగించిన
పరికరాలు, దిల్లీలోని రాష్ట్రపతిభవన్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చరిత్ర,
భారత రాజ్యాగం వంటివి ఉన్నాయి. జైహింద్ ర్యాంప్, భూగర్భ సొరంగం
ఆకర్షిస్తాయి. 120 అడుగుల జాతీయ పతాకాన్నీ చూడొచ్చు.