అమరావతి : గిరిజన విద్యాసంస్థల్లో చదువుకొనే పిల్లల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం
వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన
సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్న దొర హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో
విద్యార్థుల సంరక్షణకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని
ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో
రాజన్నదొర పలు అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. గిరిజన
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించడానికి గతంలో ఉన్న ఏఎన్ఎంల
సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఆశ్రమ
పాఠశాలల్లో 590 మంది ఏఎన్ఎంలను నియమించడంతో పాటుగా ఆయా పాఠశాలల పరిధిలోని
సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంతో గిరిజన విద్యార్థులను ముందుగా మ్యాపింగ్
చేయించాలని సూచించారు. పాఠశాలలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో
సమన్వయం చేసుకొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించాలని
చెప్పారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లోని అధికారులు తక్షణమే
స్పందించి విద్యార్థులను ఆస్పత్రులకు చేరవేసి అవసరమైన చికిత్సలను
చేయించాలన్నారు.
ఈ విషయంలో ఏ అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై
కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాజన్న దొర స్పష్టం చేసారు. గిరిజన
విద్యా సంస్థల్లో భద్రతను పెంచడంలో భాగంగా ఇదివరకే ఉన్న సీసీ కెమెరాలకు
మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన అన్ని చోట్లా కొత్తగా కెమెరాలను ఏర్పాటు
చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థులు
మంచి ఫలితాలను సాధించేలా డీటీడబ్ల్యుఓలు, డీడీలు, ఇతర అధికారులు పాఠశాలల
పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
చింతపల్లిలోని ఎస్టీ డిగ్రీ కళాశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని,
సీతంపేటలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలను నిర్మించడానికి చర్యలు
చేపట్టాలని అధఇకారులను కోరారు. మాతృభాషా వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వేతనాలను
సక్రమంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జీసీసీలో చాలా కాలంగా
పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులు,
కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న దొర అధికారులను
ఆదేశించారు. కాఫీ రైతులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన చెల్లించడానికి,
కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జీజీసీ
అధికారులను కోరారు.