ఇండోర్‌లో ఇండియాకు తప్పని ఓటమి
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 3వ టెస్టు మ్యాచ్
IND vs AUS, 3rd Test: ఇండోర్ టెస్టులో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. 76 పరుగుల
స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది.
నెర్రెలు వాసిన
పిచ్! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్ గేమ్ ఆడితే
గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్ఇండియా
సిచ్యువేషన్ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76
పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్
గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి
టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్ హెడ్ (49; 53 బంతుల్లో
6×4, 1×6), మార్నస్ లబుషేన్ (28; 58 బంతుల్లో 6×4) ఎలాంటి ‘కంగారూ’ లేకుండా
ఆసీస్‌ను గెలిపించేశారు.
వికెట్లు పడలేదు!
మూడో రోజు, శుక్రవారం ఆసీస్ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే
ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి
వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్
లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు
తీసుకెళ్లాడు. టీమ్ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల
తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి
ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9
వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.
ఇన్నింగ్స్ వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ – 109 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 197 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ – 163 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 78/1తో విజయం