చంద్రగిరి : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆర్థికంగా
అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ముస్లింలతో
నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే
ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. జగన్
పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని
ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అవ్వగానే గతంలో ఇచ్చిన విధంగా రంజాన్
తోఫా, దుల్హన్, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను
పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు. చంద్రబాబును గెలిపించి ఉంటే పోలవరం పూర్తి
అయ్యేది : టీడీపీ అధినేత చంద్రబాబును గెలిపించి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదని,
గ్రావిటీ ద్వారా రాయలసీమ నీళ్లు వచ్చేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్ తెలిపారు. టీడీపీ హయాంలో హంద్రీనీవా పనులు 90% పూర్తి చేసినా మిగిలిన
10 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కొండేపల్లి క్రాస్ దగ్గర
మామిడి రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
‘‘రూ.లక్ష కోట్లు దోచుకుని 16 నెలలు జైల్లో ఉన్న మోసగాడు..ఎప్పుడూ మోసమే
చేస్తాడు. దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. టీడీపీ అధికారంలోకి
రాగానే దళితుల భూములు తిరిగి ఇప్పిస్తాం. కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టం
తెస్తాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో జాప్యం చేస్తున్నారు. డీకేటి భూములపై హక్కు
కల్పించేలా చట్టం తీసుకువస్తాం. ఇరిగేషన్, వ్యవసాయశాఖ మంత్రులకు సమస్యలు
పట్టవని లోకేష్ ధ్వజమెత్తారు.