కరీంనగర్ : భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు
రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి
పేద మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందనీ, ప్రధాని మోడీ మిత్రుడు
అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని రాష్ట్ర బీసీ
సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్యాస్ ధరల పెంపును
నిరసిస్తూ కరీంనగర్ పట్టణం లోని తెలంగాణ చౌక్ లో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన
చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్
కటౌట్లు, సిలిండర్లతో, వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో సిలిండర్
పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందను,
బిజెపి అధికారంలోకి రాకముందు 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న
సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుందనీ అన్నారు. స్వాతంత్ర్య భారత దేశ
చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో
సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని అన్నారు. ధరల
పెంపు పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల బాధలను
పట్టించుకోవడం లేదనీ,పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదనీ
అన్నారు. అదానికి దోచి పెట్టేందుకు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారనీ,
మన రక్తపు ముద్దను మోడీ గుజరాత్ కు దోచిపెడుతున్నారనీ అన్నారు.
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు… కళ్యాణ
లక్ష్మి…కెసిఆర్ కిట్… వ్యవసాయానికి ఉచిత కరెంటులతో తెలంగాణలో ఆకలికేకలు
లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రధాని మోడీ పెట్రోల్ , గ్యాస్ ,
పప్పులు, నిత్యావసర ధరలు పెంచి దేశ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి
చేస్తున్నారనీ దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200 నుంచి 8 వందలకు
తగ్గించాలనీ, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమనీ హెచ్చరించారు. గ్యాస్ పెంపు
ధరలను ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిల భార్యలతో పాటు ఏ ఆడబిడ్డ కూడా
ఒప్పుకోదనీ,పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బిఆర్ఎస్
అండగా ఉంటుందనీ తెలిపారు. రాష్ట్రంలో ఓవైపు సంక్షేమ పథకాలతో తెలంగాణలోని అన్ని
వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని
బిజెపి ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తుందనీ అన్నారు.
పెంచిన ధరలు తగ్గించేవరకు ఈ పోరాటం ఆగదనీ హెచ్చరించారు.