ముఖాముఖిలో సెపీ సీఈవో డాక్టర్ రిచర్డ్ హాచెట్
హైదరాబాద్ : ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ మహమ్మారి మానవాళికి విసిరిన
సవాల్ ఇంకా సమసిపోలేదని ‘కొలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్
ఇన్నోవేషన్స్(సెపీ-యూకే) సీఈవో డాక్టర్ రిచర్డ్ హాచెట్ హెచ్చరించారు.
వ్యాధులు, కారణాలు, వాటిపై జరిగిన పరిశోధన వ్యాసాలు, ఫలితాలు తదితర అంశాలతో
కూడిన సమాచారాన్నంతా ఒకే చోటికి చేర్చి ప్రపంచంలోని వ్యాక్సిన్ల పరిశోధకులకు
అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని
హెచ్ఐసీసీలో జరుగుతున్న 20వ బయో ఆసియా సదస్సులో పాల్గొనడానికి వచ్చిన
డాక్టర్ రిచర్డ్ ముఖాముఖిలో పలు అంశాలను పంచుకున్నారు.
రోగ నిరోధక టీకాల వృద్ధిలో సెపీ పాత్ర ఏమిటి?
సెపీ ఒక స్వచ్ఛంద సంస్థ. అంతర్జాతీయంగా ప్రబలుతున్న వేర్వేరు వ్యాధులను
అరికట్టడానికి అవసరమైన టీకాల పరిశోధనకు ఆర్థికంగా, శాస్త్రీయంగా సహకరిస్తుంది.
సెపీ వద్ద ప్రస్తుతం 4 బిలియన్ డాలర్ల(రూ.33,192 కోట్లు) నిధులున్నాయి.
వీటిని రోగ నిరోధక టీకాల వృద్ధి కోసం వెచ్చిస్తాం. కొవిడ్ నేపథ్యంలో.. టీకాల
కోసం దాదాపు 2 బిలియన్ డాలర్లను కేటాయించాం. ఎబోలా, లాసా ఫీవర్, మార్బర్గ్
ఫీవర్, జికా, నిపా వైరస్, గన్యా, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ తదితర వ్యాధులను
అడ్డుకోవడానికి అవసరమైన టీకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాం.
కొవిడ్ సవాళ్లు ముగిసినట్టేనా?
ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొన్నాళ్లుగా ప్రపంచ దేశాలన్నీ
ఉపశమనం పొందుతున్నాయి. అయితే వైరస్ పూర్తిగా కనుమరుగైందని ఏమరుపాటుగా
ఉండొద్దు. కరోనాలో ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జన్యు పరిణామ
క్రమంలో ఒక్కోసారి వైరస్ విరుచుకుపడే ప్రమాదమూ ఉంది. అందువల్ల దాని
పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. మార్పులకు తగ్గట్లుగా మనల్ని మనం
మార్చుకుంటూ ఉండాలి. మనం సన్నద్ధమయ్యే వరకూ వైరస్లు వేచిచూడవు. మూడేళ్ల కిందట
కొవిడ్-19 విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పుడు నిపా వైరస్ పొంచి ఉంది.
హెచ్5ఎన్1 ఇన్ఫ్లూయెంజా వైరస్ ఇప్పటికే స్పెయిన్లో దడ పుట్టిస్తోంది. ఇది
కూడా అత్యంత వేగంగా మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుంది. దక్షిణ అమెరికాలోని
పరాగ్వేలో గన్యా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఉగాండాను ఎబోలా వైరస్
కుదిపేస్తోంది. ఏ వ్యాధి లేదా వైరస్ ఎక్కడి నుంచి, ఎప్పుడు ఉద్భవిస్తుందో
అంచనా వేయలేం. కొత్త కొత్త ఉపద్రవాలకు మనం సిద్ధపడాల్సిందే. వాటి నుంచి పాఠాలు
నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే.
భారత్తో కలిసి సెపీ పనిచేస్తుందా?
భారత్లో నైపుణ్యాలకు కొదవలేదు. ఇక్కడ జీవ ఔషధ రంగాలు అద్భుతంగా అభివృద్ధి
చెందాయి. భవిష్యత్తులో ఇన్ఫెక్షియస్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన ముఖ్యమైన
ప్రయోగాలు ఇక్కడ జరగడానికి అవకాశాలు పెరిగాయి. టీకాలు, ఔషధాల విభాగంలో
భారత్లోని అనేక సంస్థలతో మాకు భాగస్వామ్యముంది. ఇప్పటికే సీరం
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొన్ని ఔషధ సంస్థలతో కలిసి
పనిచేస్తున్నాం. ఇంకా కొన్ని సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రయత్నాల్లో
ఉన్నాం.