ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తదుపరి న్యాయమూర్తిగా సేవలందించి పదవీ
విరమణ చేసిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు
పలికింది. శుక్రవారం రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పుల్ కోర్టు
ఆధ్వర్యంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
ఈవీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్
మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ
ఏర్పాటైనపుడు భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనలో ఇన్చార్జి ప్రధాన
న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ మెరుగైన కృషి చేశారని కొనియాడారు.
జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయమూర్తిగా సుమారు 26 వేల కేసులను పరిష్కరించి
ఎనలేని సేవలందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ప్రత్యేకంగా
కొనియాడారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని, ఆయన
వ్యక్తిత్వం పూర్తిగా విశ్వాసం, కరుణతో నిండి ఉందని పేర్కొన్నారు. జస్టిస్
ప్రవీణ్ కుమార్ వివిధ కమిటీలకు సభ్యునిగా ఉండి న్యాయవ్యవస్థకు మెరుగైన సేవలు
అందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె.మిశ్రా కొనియాడారు. అంతేగాక ఎపి
జుడీషియల్ ఎకాడమీకి, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీకి కూడా జస్టిస్ ప్రవీణ్
కుమార్ ప్రశంసిచ దగ్గ సేవలను అందించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్
కుమార్ మిశ్రా కొనియాడారు.న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మూడు రాష్ట్రాలకు మూడు హైకోర్టులుగా
వర్ధిల్లిన ఘన చరిత్ర కలిగి ఉందని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. 2018 డిశంబరు
31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైదరాబాదు నుండి విజయవాడకు రావడం జరిగిందని, 2019
ఫిబ్రవరిలో ఇక్కడ హైకోర్టు భవనం ప్రారంభం కాగా 2019 మార్చి నుండి హైకోర్టు
కార్యకలాపాలు ఇక్కడ జరుగు తున్నాయాని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ
జస్టిస్ ప్రవీణ్ కుమార్ నిర్వివాద వ్యక్తే కాకుండా మంచి మానవతావాదని, సింపుల్
గా ఉండే వ్యక్తని కొనియాడారు. అదే విధంగా హైకోర్టుకు ఇన్చార్జి ప్రధాన
న్యాయమూర్తి గాను, ప్రస్తుతం న్యాయమూర్తి గాను ఆయన న్యాయవ్యవస్థకు అందించిన
సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు
కె.జానకిరామి రెడ్డి , ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, డిప్యూటీ సొలిసిటర్
జనరల్ హర్ నాధ్ , రాష్ట్ర హైకోర్టుకుచెందిన పలువురు న్యాయమూర్తులు, రిజిష్ట్రార్లు, అదనపు అడ్వకేట్ జనరల్, పిపి,
బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.