హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్‌తో తెలంగాణ
ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు
చేశారు. రూ.800 కోట్లకుపైగా పెట్టుబడితో ముందుకొచ్చిన ఈ సంస్థ ద్వారా 1500
మందికి ఉపాధి అవకాశాలు లభిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే
అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా బ్రిస్టల్
మేయర్స్ సంస్థ ప్రతినిధులకు వివరించారు. ‘‘బ్రిస్టల్ మేయర్స్ సంస్థ
ప్రపంచంలోనే టాప్ టెన్ ఫార్మా కంపెనీల్లో ఒకటి. తెలంగాణలో లైఫ్ సైన్సెస్
రంగం బలంగా, వేగంగా ఎదుగుతోంది. ఈ రంగంలో ఉన్న యువతకు ఇదొక మంచి అవకాశం.
ఇప్పటివరకు భారత్‌లో లేని ఒక సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం గొప్ప
విషయం. దేశంలో ఎక్కడైనా ఒక సంస్థ యూనిట్‌ను పెట్టాలంటే 12 నుంచి 18 నెలల
వ్యవధి పడుతుంది. అయితే, హైదరాబాద్ ఫార్మా సిటీలో అలా కాకుండా అన్ని అనుమతులు
ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా ఇక్కడ వెంటనే సంస్థ కార్యకలాపాలు
మొదలుపెట్టొచ్చన్నారు.
హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇతర అనుకూలతలను కూడా సంస్థ పరిగణనలోకి తీసుకోవాలని
సంస్థ ప్రతినిధులకు సూచించాం. తయారీ రంగంలోనూ బ్రిస్టల్ మేయర్స్ దృష్టి
సారించాలి’’ అని కేటీఆర్ సూచించారు. బ్రిస్టల్ మేయర్స్ ప్రతినిధి సమిత్
హిరావత్ మాట్లాడుతూ ‘‘ఫార్మారంగంలో సరికొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి,
ఉత్పత్తి మా లక్ష్యం. మాది క్యాన్సర్, ఇమ్యునాలజీ, సెల్ థెరపీ, ఆంకాలజీ,
గుండె రక్తనాళాల వ్యాధులకు ఔషధాలను అభివృద్ధి చేసే ప్రత్యేకమైన సంస్థ.
నాలుగేళ్ల క్రితం నేను చూసిన హైదరాబాద్ కంటే ఇప్పుడు అద్భుతమైన అభివృద్ధి
కనిపిస్తోంది. మేం భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం. ఈ రంగంలో
మెరుగైన అవకాశాల కోసం చూస్తున్నాం. వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల
పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.