బెయిల్‌పై బయటకొచ్చిన సప్నా గిల్
పోలీసులకు ఫిర్యాదు.. పృథ్వీ షాపై కేసు నమోదు
బెయిలుపై బయటకు వచ్చాక భారత క్రికెటర్ పృథ్వీ షాపై సోషల్ మీడియా
ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ కేసు పెట్టారు. క్రికెటర్ పృథ్వీ షా స్నేహితుడి
కారును ధ్వంసం చేసినందుకు ఒషివారా పోలీసులు కేసు పెట్టిన 8మందిలో సప్నా గిల్
ఒకరు. తమను మొదట రెచ్చగొట్టింది భారత క్రికెటర్, అతని స్నేహితులేనని సప్నాగిల్
ఆరోపించారు. సెల్ఫీ వివాదంలో క్రికెటర్ కు సప్నాగిల్ కు మధ్య జరిగిన గొడవలో
కారు విండ్‌షీల్డ్ దెబ్బతింది.
సోషల్ మీడియా ఫేమ్ అయిన సప్నాగిల్ క్రికెటర్ పృథ్వీ షా, అతని స్నేహితుడు
ఆశిష్ యాదవ్‌పై ముంబై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ
ఫిర్యాదుతో వివాదం ముగిసేలా కనిపించడం లేదు.మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు
చేయడంతో సప్నా గిల్ ముంబై పోలీసు కస్టడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా
కేసు పెట్టారు.ముంబయిలోని ఓ హోటల్లో భోజనం చేస్తుండగా పృథ్వీ షా సెల్ఫీలకు
నిరాకరించడంతో ఈ గొడవ జరిగింది.
ఫిబ్రవరి 15వ తేదీన తాను ఒక క్లబ్‌కి వెళ్లానని, ఆ క్రికెటర్, అతని
స్నేహితులు మద్యం మత్తులో ఉన్నారని సప్నాగిల్ పేర్కొంది. శోభిత్ ఠాకూర్ అనే తన
స్నేహితుడు సెల్ఫీ కోసం షాను సంప్రదించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సెల్ఫీ
వివాదానికి తాజా ట్విస్ట్‌లో పృథ్వీ షా తనపై దాడికి పాల్పడ్డాడని సప్నాగిల్
ఆరోపించింది. పృథ్వీ షాపై క్రిమినల్ కేసు పెట్టింది. ముంబై ఎయిర్ పోర్ట్
పోలీసులను ఆమె ఆశ్రయించింది. పృథ్వీ షా, అతడి స్నేహితులు తన పట్ల అనుచితంగా
ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సప్నా గిల్ ఫిర్యాదు మేరకు
పృథ్వీ షా, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 120b, 144,
146, 148, 149, 323, 324, 351, 354, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు.