రాజమండ్రి : పోలవరం ప్రాజెక్టు విషయంలో గత సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రంలోని
ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నిర్మాణ పనుల్లో జాప్యత
జరుగుతోందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని
భరత్ రామ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికార పార్టీ
ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ
మంత్రి అంబటి రాంబాబు, తూర్పు గోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన
వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి, ఏలూరు ఎంపీలు భరత్, కే శ్రీధర్, తూర్పు గోదావరి
జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,
రంపచోడవరం, గోపాలపురం ఎమ్మెల్యేలు నాగులాపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావు
ఉన్నారు. ప్రాజెక్టు ఆఫీసర్ ప్రవీణ్ ఆదిత్య కూడా బృందంతో పాటు ఉన్నారు.
ప్రాజెక్టు సందర్శన అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా ప్రాజెక్ట్
ను పరిశీలించామని, లోపాలను గుర్తించామని తెలిపారు. అప్పర్ కాపర్ డ్యామ్, అప్
స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ పూర్తయి..ఈ రెండింటి
మధ్యలో కిందన బేస్మెంట్ లాంటి డయా ఫ్రం వాల్, ఎర్త్ కం రాఫిల్ డ్యామ్ నిర్మాణం
కావలసి ఉందన్నారు. అయితే గత టీడీపీ చంద్రబాబు హయాంలో సగం సగం పనులతో కాపర్
డ్యామ్ పూర్తి చేయడంతో ఇటీవల వచ్చిన వరదలకు డయా ఫ్రం వాల్ కు బీటలు
పడ్డాయన్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రాజెక్టు పనులను ఎలా
ముందుకు కొనసాగించాలనే అంశాన్ని సాంకేతిక నిపుణుల బృందం, సంబంధిత అధికారులతో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా హెడ్
వర్క్స్, ఆర్ అండ్ ఆర్ తదితర విషయాలలో కేంద్రం సక్రమంగా నిధులు విడుదల
చేయకపోవడం వల్లనే పనుల్లో జాప్యత ఏర్పడుతోందన్నారు. ప్రాజెక్టును పూర్తి
స్థాయిలో అధ్యయనం చేసి డబుల్ డయా ఫ్రం వాల్ నిర్మించాలా, లేకపోతే ఇప్పుడున్న
డయా ఫ్రం వాల్ మరమ్మతులు చేస్తే సరిపోతుందా ఇవన్నీ సాంకేతికంగా ఆలోచన
చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ప్రాజెక్టు విషయంలో కేంద్రం రూ.33 వేల కోట్లు
ఇవ్వాల్సి ఉందని, మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా లోక్సభ లో కేంద్ర
ప్రభుత్వాన్ని, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ను ప్రశ్నించామన్నారు.
అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి రావలసిన నిధులు, పెండింగ్ సమస్యలపై
ప్రస్తావిస్తూనే ఉన్నామన్నారు. చంద్రబాబు తప్పిదాలను పరిగణలోకి తీసుకొని
కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు విషయంలో జాప్యం చేస్తోందని ఎంపీ భరత్
అన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే జీఎస్టీ కడుతున్నా సకాలంలో నిధులు ఇవ్వడం
లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 10 నుండి జరగబోయే పార్లమెంటు
సమావేశాలలో ‘డిమాండు ఫర్ గ్రాంట్స్’ తప్పకుండా అడుగుతామని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు, సూచనల మేరకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని
అడగవలసిన అన్నిటిని గూర్చి కుండబద్దలు కొట్టినట్టు అడుగుతామని ఎంపీ భరత్
చెప్పారు.