సెలబ్రిటీ దంపతులు నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారనే వార్తలు బయటకు రావడం తీవ్ర వివాదస్పదం అయింది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎమ్. సుబ్రమణియం కూడా ఈ వివాదంపై స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నయనతారపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ప్రభుత్వానికి కమిటీ అందజేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నయన్-విఘ్నేశ్ చట్టబద్దంగానే సరోగసీకి వెళ్లారని ఆ రిపోర్టు వెళ్లడించింది. దంపతులు సరోగసీ నిబంధనలను ఉల్లఘించలేదని కమిటీ పేర్కొంది. నయనతార అనారోగ్య కారణాలతోనే సరోగసీకి వెళ్లినట్టు ఆ నివేదిక తెలిపింది. ఈ దంపతులు 2016లోనే రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసి ప్రక్రియ జరిగిందని సమాచారం. నయనతార, విఘ్నేశ్ శివన్ దాదాపు ఆరేళ్లు డేటింగ్ చేశారు.
అనంతరం సంప్రదాయ బద్దంగా జాన్ 9న పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే తమకు కవలలు జన్మించారని అక్టోబర్ 9న విఘ్నేశ్ శివన్ ట్విట్టర్లో పోస్ట్‌ను షేర్ చేశాడు. సరోగసీ వివాదస్పదం కావడంతో విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించాడు. ‘‘మన వెన్నంటే ఎల్లప్పుడు ఉండి, మన బాగోగులు చూసుకునేవారి అభిప్రాయాలను గౌరవించు. వారే మన గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికి ఇదే వాస్తవం’’ అని విఘ్నేశ్ శివన్ చెప్పాడు. ‘‘సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని నీకు లభిస్తాయి. అంత వరకు సహనంతో ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో’’ అని విఘ్నేశ్ తెలిపాడు.