ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అంటూ రేవంత్ ట్వీట్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఉమ్మడి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఒక
ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం
రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కొరమేను చేపలతో కూర వండి భోజనం పంపించింది.
చేపలకూరను వారే స్వయంగా ఆయనకు అందజేశారు. ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరించాలని
కోరారు. పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి కిరణ్ ముదిరాజ్ అనే యువకుడి ఇంటికి
వచ్చారు. రేవంత్ రాక నేపథ్యంలో కిరణ్ చెరువులోంచి కొరమేను చేపలను
పట్టుకొచ్చారు. ఆ తాజా చేపలతో రుచికరమైన పులుసుతో పాటు, ఫ్రై చేసి రేవంత్ కు
పసందైన భోజనం అందించారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ
ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే నా
పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన
భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి
సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు.