చుక్కలనంటుతున్న నిత్యావసర ధరలతో ఆగమాగమవుతున్న పాక్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం
మరో షాకిచ్చింది. తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర
రికార్డు స్థాయిలో రూ. 272కు చేరుకుంది. విదేశీ మారకద్రవ్యం నిల్వలు
అడుగంటడంతో అలమటిస్తున్న పాకిస్థాన్ విదేశీసాయం కోసం తీవ్రప్రయత్నాలు
చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ఆర్థికసాయం
అందించేందుకు ముందుకొచ్చింది. అయితే నిధుల విడుదలకు ఐఎమ్ఎఫ్ విధించిన నిబంధనల
మేరకు పాక్ ఈమారు పెట్రోల్ ధర ఏకంగా రూ.22.20 (పాకిస్థానీ రూపయ్యా) మేరకు
పెంచింది. పెట్రోల్‌తో పాటూ డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు
చేరుకుంది. లీటర్ కిరోసిన్ ధర రూ.202.70కు చేరుకుంది. కొత్త ధరలు గురువారం
నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు నిధుల విడుదల కోసం
అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు
నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ
బడ్జెట్లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజల
లబోదిబోమంటున్నారు. అయితే ఐఎమ్ఎఫ్ ఆర్థికసాయం పాక్‌ను గాడిలో పెట్టే అవకాశం
తక్కువని మూడిస్ ఎనలిటిక్స్ సంస్థ సీనియర్ ఆర్థికవేత్త కట్రీనా ఎల్
అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో పాక్ ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 33
శాతానికి చేరుకుని ఆపై తగ్గడం ప్రారంభిస్తుందని అంచనా వేశారు.