గురువారం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద రాష్ట్రంలో రెండోరోజు పాదయాత్ర ప్రారంభం
హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో గురువారం పునఃప్రారంభం కానుంది. ఆదివారం రాష్ట్రంలో తొలిరోజు పాదయాత్ర ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి రాహుల్ రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు. నారాయణపేట జిల్లా టైరోడ్ వద్ద రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం 6.30 గంటలకు మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద రాష్ట్రంలో రెండోరోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా సాగుతుంది. గురువారం రాత్రి గుడిగండ్ల గ్రామం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి ఎనగండ్ల వద్ద బస చేస్తారు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పాదయాత్ర జరుగుతుంది. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రతి రోజు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. గురువారం బీడీ కార్మికులతో పాటు రైతు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, అవసరమైన కార్యాచరణ సహా పలు అంశాలపై చర్చిస్తారు.